ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ BIG స్కెచ్.. గేమ్ ఛేంజ్ చేయబోయేవి అవేనా?

by GSrikanth |
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ BIG స్కెచ్.. గేమ్ ఛేంజ్ చేయబోయేవి అవేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు కీలకంగా మారిన ఫైవ్ గ్యారంటీస్ తరహాలోనే తెలంగాణలో విజయం కోసం సిక్స్ గ్యారంటీస్‌పై సోనియాగాంధీ కీలక ప్రకటన చేయనున్నారు. రేపు తుక్కుగూడలో జరిగే విజయభేరి బహిరంగ సభ వేదిక మీద వీటిని వెల్లడించనున్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో సైతం ఫైవ్ గ్యారెంటీస్ అంటూ రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నేతలు ప్రకటించినా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాత్రం మరొకటి అదనంగా చేరుతుందని, మొత్తంగా ఆరు గ్యారెంటీలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇవి బయటకు పొక్కకుండా పార్టీ అధిష్టానం జాగ్రత్తలు తీసుకున్నా.. గ్యారెంటీలపై ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ సమాజంలోని ప్రధాన సెక్షన్ ప్రజలందరినీ కవర్ చేసేలా ఈ గ్యారంటీలు ఉంటాయన్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. సూచనప్రాయంగా వీటిపై స్పష్టత వచ్చినప్పటికీ రేపు తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగే సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించిన తర్వాత ఖరారయ్యే చాన్స్ ఉన్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ పార్టీ బలోపేతమైందని, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని, పవర్‌లోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రైతు డిక్లరేషన్‌ను గతేడాది ప్రకటించినా తెలంగాణ ప్రజల్లో భరోసా కల్పించాలని యూత్, వెల్ఫేర్, ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించడం వెనక ఉద్దేశం. ఇందులో భాగంగానే విజయభేరి బహిరంగసభ వేదిక ద్వారా నేరుగా సోనియాగాంధీ ద్వారా తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆరు గ్యారంటీలపై ప్రకటన చేయించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. కేవలం గ్యారెంటీలను ప్రకటించడం మాత్రమే కాకుండా ప్రతి గ్యారెంటీకీ నిర్దిష్ట డెడ్‌లైన్‌ను కూడా వాటితో పాటే సోనియా ప్రకటించేలా కసరత్తు జరుగుతున్నది. కర్ణాటకలో గ్యారెంటీలను ప్రకటించి అమల్లోకి తెచ్చిన కాన్ఫిడెన్సునే తెలంగాణ ప్రజల్లోనూ కల్పించాలన్నది పార్టీ ఉద్దేశం.

అన్ని సెక్షన్ల ప్రజలను కవర్ చేసేలా

తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీటిని ఖరారు చేయడంపై పార్టీ కసరత్తు చేస్తున్నది. రైతులు, మహిళలు, యువత, పేదలు, ఎస్సీ/ఎస్టీలతో పాటు దిగువ-మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ గ్యారెంటీలను ఫైనల్ చేస్తున్నట్టు రాష్ట్ర నేతలు సూచనప్రాయంగా తెలిపారు. తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమై నిర్వహించే సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా సమీక్షించిన తర్వాత ఇవి ఖరారవుతాయన్నారు. ఇప్పటికే డిక్లరేషన్ల ద్వారా కొన్ని హామీలను ఇచ్చామని, వీటిపై ప్రజల్లో చర్చ జరుగుతున్నదని గుర్తుచేశారు. సిక్స్ గ్యారెంటీస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మారుస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాట నిలబెట్టుకున్నట్టుగానే సిక్స్ గ్యారెంటీస్ కూడా ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పుతాయన్నది పార్టీ రాష్ట్ర నేతల భావన.

తెలంగాణ ఆకాంక్షలకు తగ్గట్టు సోనియా స్పీచ్

విజయభేరి సభలో సోనియాగాంధీ ప్రకటించే సిక్స్ గ్యారెంటీస్ మాత్రమే కాక ఆమె ఇచ్చే స్పీచ్ తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలకు దోహదపడుతుందని పీసీసీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆరు దశాబ్దాల కోరికను సాకారం చేసినందున.. ఆమె పట్ల పార్టీలకు అతీతంగా ప్రత్యేకమైన గౌరవభావం ఉన్నదని పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవం, ఉద్యమ స్ఫూర్తి తదితరాలను ప్రస్తావించనున్నట్టు టాక్. తొమ్మిదేండ్ల పాలనలో అవి ఏ మేరకు నెరవేరాయో ప్రస్తావించి ఇకపైన వాటిని ఫుల్‌ఫిల్ చేయడంపై హామీ ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ పార్టీకి తెలంగాణలో ఉన్న పాపులారిటీని ఓటు బ్యాంకు రూపంలోకి మార్చడానికి ఈ సభ దోహదపడుతుందన్న విశ్వాసం స్టేట్ లీడర్లలో వ్యక్తమవుతున్నది.

రాజకీయాలను మలుపుతిప్పే సభగా..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో జాతీయ రాజకీయాల గురించి చర్చ జరగనున్నది. జమిలి ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బీజేపీని ఎదుర్కోడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులు చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాలు జాతీయ రాజకీయాలకే ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటాయని ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతి రోజు జరిగే విస్తృత స్థాయి సమావేశం, దానికి కొనసాగింపుగా నిర్వహించే విజయభేరి బహిరంగసభ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా అసెంబ్లీ ఎన్నికలు జరిగే మరో నాలుగు రాష్ట్రాలతో దేశానికి టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story