కమ్యూనిస్టులతో పొత్తు అంశం.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
కమ్యూనిస్టులతో పొత్తు అంశం.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టులతో పొత్తుల అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలతో మేము మాట్లాడామని వారితో పొత్తు అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నదన్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన భట్టి.. రాహుల్ గాంధీ తనపై పోటీకి రావాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు భట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఎక్కడ పోటీ చేయాలనేది అసదుద్దీన్‌కు అనవసరం అన్నారు. ఒవైసీ ఎంఐఎం అభ్యర్థులను చూసుకుంటే సరిపోతుందని సెటైర్ వేశారు. షర్మిల కాంగ్రెస్‌కి మద్దతు తెలపడం సంతోషమని, వైఎస్సార్ కూతురుగా కాంగ్రెస్‌కు నష్టం జరగకూడదనే ఆమె నిర్ణయం స్వాగతిస్తున్నామన్నారు.

మోసపూరితమైన ప్రకటనలతో సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని ఆయన దళిత ద్రోహి అని ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం బోరోజ్‌లో రమాకాంత్ అనే దళిత యువకుడి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దళితబంధు తనకు రాలేదని తన చావుకు సీఎం కేసీఆరే కారణం అని రమాకాంత్ సూసైడ్ చేసుకున్నారని అందువల్ల ఈ మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ధ్వజమెత్తారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ మోసపూరిత ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.

దళితులకు సీఎం పదవి వస్తుందని దళితులు బీఆర్ఎస్ పార్టీ పల్లకి మోశారని, దళితబంధు పేరుతో రూ.10 లక్షలు ప్రకటిస్తే ఓట్లు వేసిన ప్రజలకు బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో దళిత బందుకు రూ.17,700 కోట్లు లెక్కలు చూపించి కనీసం రూ.300 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మరో నెల రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కేసీఆర్. కేటీఆర్. కవిత, హరీష్ రావు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మొద్దని కోరారు.

Advertisement

Next Story