ఉన్నట్లుండి దొరకు అమరుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది.. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు

by Javid Pasha |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఉన్నట్లుండి దొరకు అమరుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని సీఎం కేసీఆర్ పై ఆమె సెటైర్లు వేశారు. తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడు అమరుల త్యాగాలను గుర్తు చేయని కేసీఆర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త నాటకానికి తెరతీశారని విమర్శలు గుప్పించారు. అమరుల ప్రాణ త్యాగంతో ఏర్పడ్డ రాష్ట్రంలో ఆ ఫలాలను మాత్రం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవిస్తున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రం వచ్చాక నీళ్లు ఆయనే ఎత్తుకు పోయారు, నిధులు ఆయనే మింగారు, ఉద్యోగాలు తన ఇంటోళ్లకు ఇచ్చుకున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఉద్యమంలో 1500 మందికి పైగా అమరులైతే కేసీఆర్ ఆదుకున్నది 528 మందిని మాత్రమేనని అన్నారు.

అమరుల కుటుంబాలకు ఇళ్లు, ఉద్యోగాలు, భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అమరవీరుల స్థూపంపై అమరుల పేర్లను సువర్ణాక్షారాలతో చెక్కిస్తానన్న కేసీఆర్.. కనీసం వాళ్ల ప్రస్తావన కూడా తీసుకురావడం లేదని అన్నారు. ఇన్నాళ్లు దూరం పెట్టిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను ఎన్నికల కోసం మళ్లీ దగ్గరకు తీసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల భయంతోనే కేసీఆర్ మళ్లీ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు దగ్గర కావాలని డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించడమంటే అమరులను అవమానించినట్లేనని షర్మిల అన్నారు.

Advertisement

Next Story

Most Viewed