కేసీఆర్ సాధించింది అప్పులు, కమీషన్లు, ఆత్మహత్యలు: వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల

by sudharani |   ( Updated:2023-06-03 14:44:23.0  )
కేసీఆర్ సాధించింది అప్పులు, కమీషన్లు, ఆత్మహత్యలు: వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ పదేళ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లే అని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగమంతా అబద్ధాలమయం అని అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. ఈ పదేళ్లలో కేసీఆర్ చేసిందేమి లేకపోయినా ఎన్నికల్లో ఓట్ల కోసమే పోడు భూములకు పట్టాలు, గృహలక్షి, లక్ష రుణం, గొర్రెలు, బర్రెలు, పని ముట్లు అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ పాలసీ సంపదన పెంచడం ప్రజలకు పంచడం కాదని, సంపద వెతకడం దానిని అమ్మడం ఆ సంపదను దొర ఖజానాకు చేర్చడం అని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని ఇదే తెలంగాణ మోడల్ అని దుయ్యబట్టారు. ఉద్యమ తెలంగాణ ఇంకా ఉజ్వల తెలంగాణ కాలేదని, కేసీఆర్ నిరంకుశ పాలన అంతానికి మరో దఫా ఉద్యమం సాగించే సమయం వచ్చిందన్నారు.

రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటోందని, సకల జనుల పోరాటాన్ని తెలంగాణ రూపంలో కేసీఆర్ చేతిలో పెడితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎడమకాలి చెప్పుకింద తొక్కిపెడ్డారని ధ్వజమెత్తారు. సర్వతోముఖాభివృద్ధి, ఉజ్వల ప్రగతి అంటే నిధులు, నీళ్ళు, నియామకాలను మంటగలపడం, రెండుసార్లు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమేనా అని నిలదీశారు.

రెప్ప పాటు కరెంట్ కోతలు లేవని చెప్పి.. డిస్కంలను రూ.26వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 18 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీజం పడితే.. కొత్తగా మీరు సాధించింది ఏంటని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో లక్ష ఇండ్లు కట్టలేని మీరు.. ఇండ్లు లేని 36లక్షల మంది ఆత్మగౌరవాన్ని కాపాడినట్లా అని ఫైర్ అయ్యారు. వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కి సిగ్గుండాలన్నారు. దళితులు, రైతులు, నిరుద్యోగులు, అమర వీరుల కుటుంబాలకు ఎవరికి న్యాయం జరగలేదన్నారు.

ఇవి కూడా చదవండి:

బ్రిజ్ భూషణ్ సరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంగతేమైంది?

Advertisement

Next Story