Adilabad: మార్కెట్ చైర్మన్ పదవిపై తొలగని సందిగ్ధత

by Ramesh Goud |
Adilabad: మార్కెట్ చైర్మన్ పదవిపై తొలగని సందిగ్ధత
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై రోజులు గడుస్తున్నా సందిగ్ధత తొలగడం లేదు. జిల్లాలోని ఆయా మార్కెట్ల కమిటీ చైర్మన్ నియామకం ఇప్పటికే పూర్తయిన, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై ఆశావాహుల సంఖ్య పెరిగిపోవడంతో ఎటూ తేలడం లేదు. దీనికి తోడు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు కొనసాగడంతో వారి అనుకూల వర్గం నాయకులు కార్యకర్తలతో, అధిష్టానం సన్నిహితంగా ఉన్న వారితో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం వినతులు సమర్పిస్తూ ఎవరికి వారే పావులు కదుపుతున్నారు.

వర్గపోరుతో అయోమయంలో కార్యకర్తలు

ఆదిలాబాద్ కాంగ్రెస్ లో మునుపటి లాగే ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఆపార్టీ సీనియర్ నాయకుడు బోరంచు శ్రీకాంత్ రెడ్డి మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనెల ఉంది.ఇలాంటి సందర్భంలో నియోజక వర్గ ఇంచార్జీ కంది నామినేటెడ్ పదవుల్లో చక్రం తిప్పుతుండడంతో, మరో వర్గం వీటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకుడు, డీసీసీ పదవిని ఆశిస్తున్న మావల మండలానికి చెందిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఒక వర్గం అయితే...కంది శ్రీనివాసరెడ్డి మరో వర్గం గా ఏర్పడడంతో పలువురు పాత,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,కొత్తగా బి ఆర్ ఎస్ నుంచి పార్టీలో చేరిన వారు వీరు తీరు అర్దం కాక ,ఎవరి వెనుకాల ఉండాలన్న అయోమయంలో తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు కంది శ్రీనివాసరెడ్డి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ముందుకు పోవడమే కాకుండా, మరోవైపు అధిష్టానాన్ని మచ్చిక చేసుకునేందుకు అడపాదడపా హైదరాబాదు వెళుతూ అక్కడే మకాం వేస్తున్నారు.అంతే కాకుండా ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులను, టిపిసిసిని కలుస్తూ తన ఉనికిని చాటుకుంటుంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి సైతం తగ్గేదే లేదు.. అన్నట్టుగా ఆయన సైతం తన వర్గాన్ని పెంచుకుంటూ అధిష్టానానికి దగ్గరగా ఉంటున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బోత్ ,ఇచ్చోడ, జైనథ్ ఇతర మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను పూర్తిచేసిన ,ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కు రెండు వర్గాల నుంచి పోటి పెరగడంతో దీని నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఖరీఫ్ పంటకాలం కొనుగోలు కంటే ముందే ఈ నియమకాలు చేపట్టాల్సి ఉండగా, ఈ పదవికి పెరిగిన పోటీతో ముఖ్యంగా సీనియర్ నాయకులు పదవిపై ఆసక్తి చూపడంతో ఎవరిని నియమించాలో అనేది అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

బెడిసికొట్టిన ప్రయత్నాలు

గత రెండు నెలల క్రితం కంది వర్గానికి చెందిన నాయకునికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగిన అవి బెడిసి కొట్టాయి. తిరిగి తన ఉనికిని చాటుకునేందుకు కంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గంలో ఆయన తీరుపై వ్యతిరేకత కొనసాగుతోంది. ముఖ్యంగా కంది తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పార్టీలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు వ్యతిరేకిస్తుండగా, కొత్తగా పార్టీలో చేరిన కొందరు దూరం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి స్థానిక ఆదిలాబాద్ మండలం తో పాటు మావల మండలం నుంచి ఒకరిని నామినేటెడ్ చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కంది ప్రయత్నం చేస్తూ జయనేత మండలానికి చెందిన వ్యక్తికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించే ప్రయత్నం చేయడమే ఈ వ్యతిరేకతకు కారణంగా పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు.

ఇలాంటి సందర్భంలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి అర్హులైన పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీలోనే ఉంటూ జెండా మోసిన వారిని గుర్తించి ఆ పదవిని కట్టబెట్టాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ఆ పార్టీ సీనియర్ నాయకుడు కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. ఈయనకు శ్రీకాంత్ రెడ్డి తోపాటు పలువురు పార్టీలోని సీనియర్ నాయకులు సైతం మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అధిష్టానం కూడా ఈ చైర్మన్ పదవి అర్హులైన, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జెండా మోసిన వారిని గుర్తించి పదవి ఇచ్చే యువచరంలో ఉన్నట్లు వినికిడి.

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా 2004 నుండి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న తనకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన నలిమెల నవీన్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను శుక్రవారం కలిసి తన వినతినీ అందజేశారు.ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నవీన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్తానాన్ని ఆయనకు కూలంకషంగా వివరించినట్లు తెలిసింది . అయితే పదవిని స్థానిక నేతలకే కేటాయించాలని, ఇతర మండలాలకు చెందిన నేతలకు కేటాయించకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed