తుంగభద్రలో ఇసుక తోడేళ్లు..!

by Rani Yarlagadda |
తుంగభద్రలో ఇసుక తోడేళ్లు..!
X

దిశ, గద్వాల: జిల్లాలో ఇసుకాసురులు నాయకులు, సంబంధిత అధికారులు అండతో రెచ్చిపోతున్నారు. తనిఖీల్లో పట్టుబడిన పోలీసులు కేసులు నమోదు చేసిన బేఖాతర్ చేస్తూ ఇసుక అక్రమ దందా గుట్టుగా సాగిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడుతూ జిల్లాలో నిత్యం ఇదే తంతు కొనసాగుతోంది. ఏపీలో ఉచిత ఇసుకను నడిగడ్డ కేంద్రంగా రవాణా చేస్తూ రూ.లక్షల్లో గడిస్తున్నారు.

జిల్లాలో అక్రమ ఇసుక రవాణా ఇలా..

ఐదు నెలలుగా గద్వాల జిల్లాలోని అలంపూర్, రాజోలి మండలాల్లోని పలు ప్రభుత్వ రీచ్ లలో "మన ఇసుక వాహనం" ద్వారా రవాణా జరగడంలేదు. టీఎస్ఎండీసీ ద్వారా కేవలం ప్రభుత్వ పనులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణాలకు ఇసుక కొరత భారీగా ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ఇసుక అక్రమ రవాణాకు సిద్ధమయ్యారు. అలంపూర్, రాజోలిలలో ఇసుక అక్రమ డంపులు చేసిన వారి నుంచి టిప్పర్ ఇసుక ట్రిప్పు ఇంటి నిర్మాణాలకు అవసరం ఉన్న వాళ్లకి దూరాన్ని బట్టి రూ.40వేలకు పైగా వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక తయారీ..

జిల్లాలోని ఇసుక అక్రమార్కుల వ్యాపారం గద్వాల మండలం సంగాల, గోనుపాడు, గట్టు మండలంలోని పలు గ్రామ శివార్లలో ఫిల్టర్ ఇసుక తయారీ భారీగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. స్థానిక నాయకుల అండదండలతో ఫిల్టర్ ఇసుక తయారు చేసి ట్రాక్టర్ల ద్వారా గృహ నిర్మాణాలు చేస్తున్న వారికి స్వచ్ఛమైన యేటి ఇసుక అంటూ అర్థరాత్రి దాటిన తర్వాత ఫిల్టర్ ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు.

వార్తలు రాస్తున్న విలేకరులకు వార్నింగ్ లు

అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న వార్తలు రాస్తున్న విలేకరులను సైతం దుర్భాష లాడుతూ బెధిరింపులకు గురిచేస్తున్నారు. గత నెల క్రితం ఇటిక్యాల మండలంలో ఓ పత్రికకు చెందిన జర్నలిస్టు ఇసుక అక్రమ రవాణాపై వార్త రాసినందుకు ఓ అక్రమ వ్యాపారి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. అదే సమయంలో జర్నలిస్టు సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గద్వాల సీఐ శ్రీనివాస్ కు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని జర్నలిస్టులకు ఎస్పీ హామీ ఇచ్చారు. పర్యావరణానికి హాని తలపెట్టిన వారిపై కథనాలు రాయాలని జర్నలిస్టులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed