ఇలాంటి అరెస్టులకు షర్మిల భయపడే వ్యక్తి కాదు: వైఎస్ విజయమ్మ

by Satheesh |
ఇలాంటి అరెస్టులకు షర్మిల భయపడే వ్యక్తి కాదు: వైఎస్ విజయమ్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడే వారిని ప్రభుత్వం అణిచివేస్తోందని వైఎస్ విజయమ్మ విమర్శలు చేశారు. చంచల్ గూడ జైలులో మంగళవారం షర్మిలను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని ఆమె స్పష్టంచేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నిస్తోందని, గ్రూప్స్, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా అని ఆమె ప్రశ్నించారు. షర్మిల సిట్‌కు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకున్నట్లని, ఆమె క్రిమినలా? టెర్రరిస్టా? అని విజయమ్మ దుయ్యబట్టారు.

ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటోందని ఆమె ధ్వజమెత్తారు. అందుకే నిరుద్యోగుల సమస్యలపై షర్మిల పోరాడుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల సమావేశాలకు అనుమతులు ఇచ్చి షర్మిలను మాత్రం ఎందుకు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. ఎంత కాలం అరెస్టులు చేసి జైల్లో పెట్టగలరని ఆమె నిలదీశారు. ఇలా అణచివేస్తూ ప్రజలే ప్రశ్నించే రోజు ప్రభుత్వం, పోలీసులు తెచ్చుకోవద్దని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై తన తీరు మార్చుకోకపోతే ప్రజలు, నిరుద్యోగులే సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Next Story