కవిత చేసిన పనికి మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి: YS షర్మిల ఫైర్

by Satheesh |
కవిత చేసిన పనికి మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి: YS షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని ప్రగతి భవన్ ముందు చేయాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించుకునేందుకే కవిత ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. బతుకమ్మ ముసుగులో కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడిందని ఆరోపించారు. కవిత తీరు వల్ల మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

2014, 2018లో ఎంత మంది మహిళలకు రాజకీయంగా కేసీఆర్ అవకాశం ఇచ్చారో కవిత చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో నాలుగు ఐదు శాతం కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయని మీరు.. ఢిల్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. గవర్నర్‌పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కవిత రేపో మాపో అరెస్ట్ కాబోతోందని తెలిసే ఈ ఇష్యూను ముందేసుకున్నారని విమర్శించారు.

కేసీఆర్, కేటీఆర్‌కు మహిళలంటే గౌరవం ఉందా అని ప్రశ్నించారు. పోడు భూముల కోసం కొట్లాడిన మహిళలను, 317 జీవో రద్దు కోసం మహిళా ఉపాధ్యాయులు పిల్లలతో సహా నిరసనకు దిగితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో మహిళ అంటే ఒక్క కేసీఆర్ కూతురే అన్నట్లుగా చూపిస్తున్నారని ఓడిపోయినా ఆమెకే కొలువులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. బతుమక్మ ముసుగులో బిడ్డ లిక్కర్ స్కామ్ చేసిన కేసీఆర్ వెనుకేసుకొస్తున్నారని.. ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఉంటుందా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో కవితపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలే అయితే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.

మీడియా ముందుకు వచ్చి అసలేం జరిగిందే చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని అందువల్ల అతడు చేసే యాత్ర దొంగ పాదయాత్ర అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత అడ్డంగా దొరికితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, లిక్కర్ స్కామ్‌లో రేవంత్ రెడ్డి ముడుపులు తీసుకుని మౌనం వహిస్తున్నాడని తాము భావిస్తున్నామన్నారు. ముందుస్తు ఎన్నికలకు పోయినా గెలవబోయేది లేదని కేసీఆర్‌కు అర్థం అయిందని అందువల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్లబోడనే అనుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story