Hardeep: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. నిందితులుగా ఉన్న నలుగురు భారతీయులకు బెయిల్

by vinod kumar |
Hardeep: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. నిందితులుగా ఉన్న నలుగురు భారతీయులకు బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep singh nijjar) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయులకు కెనడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2024 మేలో నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు కరణ్ బ్రార్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్, అమన్‌దీప్ సింగ్‌లను అరెస్టు చేశారు. వీరిపై హత్య, హత్యకు కుట్ర వంటి అభియోగాలు మోపారు. అప్పటి నుంచి వారు జైలులోనే ఉండగా తాజాగా బెయిల్ లభించింది. వీరిపై వచ్చే నెల11న బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సర్రేలోని గురుద్వారా వెలుపల దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ పదే పదే ఖండించింది. ట్రూడో వ్యాఖ్యల తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed