ఊరు గొప్ప, పేరు దిబ్బ.. దొర KCR డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: షర్మిల ఫైర్

by Satheesh |   ( Updated:2023-07-10 13:35:34.0  )
ఊరు గొప్ప, పేరు దిబ్బ.. దొర KCR డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరానికి అన్ని తానై కట్టిన దొర అండ్ మెగా ఇంజనీర్ పనితనం మూన్నాళ్ల ముచ్చటే అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వర్షాలు లేకున్నా కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అని చెప్పి.. నార్లు పోసేందుకు చుక్క నీరు అందకపాయే అని ఆరోపించారు. ఊరు గొప్ప, పేరు దిబ్బ లెక్కుంది.. దొర డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి అని సోమవారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కష్టమొస్తే విలువ తెలుస్తదని చెప్పిన మాటలకు, కష్టకాలంలో ప్రాజెక్ట్ చూపే ప్రతిభకు పొంతనే లేదన్నారు.

ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతున్నా.. ఎత్తి పోయాల్సిన బాహుబలి మోటార్లు దొర లెక్కనే నిద్రపోతున్నయన్నారు. వారంలో 21 టీఎంసీలు తోడాల్సిన కేసీఆర్ కీర్తి కిరీటం.. 4 టీఎంసీలకే చతికిలబడ్డదన్నారు. రోజుకు 3 టీఎంసీలు అని చెప్పిన ప్రాజెక్ట్ అసలు స్వరూపం అర టీఎంసీ దాటలేదన్నారు. 17 మోటర్లకు పట్టుమని పది మోటార్లు కూడా నడుస్తలేవని ఆరోపించారు.

లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేసి.. ఇదేనా దొర నువ్వు సాధించిన జలకళ? కాళేశ్వరం తెలంగాణకు జలజాతర కాదని, రాష్ట్రం నెత్తిన గుదిబండగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర సొమ్మును ఆరగించే వైట్ ఎలిఫెంట్ అయితే.. ప్రాజెక్ట్ పేరు చెప్పి ఖజానాను పీల్చిన జలగ కేసీఆర్ అని విమర్శించారు.

రూ.1.51 లక్షల కోట్లు పెట్టి లక్ష ఎకరాలను కూడా తడపలేదని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిలో సగం కరెంట్ వాడి ఏ ప్రాజెక్టు నింపలేదని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదకు కాళేశ్వరం చిల్లులు పెడుతుంటే, దొర ఖజానాలో కాసులు గలగలమంటున్నయని షర్మిల విమర్శించారు.

Advertisement

Next Story