- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ 4.0 విజన్‌పై యంగ్ లియూ ప్రశంసలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఐ-ఫోన్ ఉపకరణాల తయారీ సంస్థ ఫాక్స్ కాన్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. చిప్, మైక్రో ప్రాసెస్, సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పడానికి సూత్రరీత్యా అంగీకారం తెలిపింది. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో ఆ కంపెనీ చైర్మన్ యంగ్ లియూ, ప్రతినిధి బృందం శుక్రవారం చర్చలు రిపింది. త్వరలోనే హైదరాబాద్‌ను తమ కంపెనీ బృందం సందర్శిస్తుందని సీఎం టీమ్‌కు యంగ్ లియూ తెలిపినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లలో విస్తరించడానికి అపారమైన అవకాశాలున్న నగరంగా హైదరాబాద్‌కు ఉన్నదని యంగ్ లియు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ 4.0 పేరుతో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పడంతో సీఎం రేవంత్ విజన్ అద్భుతమని ప్రశంసలు కురిపించారు. సిటీలో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త యూనిట్లను నెలకొల్పడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందంతో చర్చల సందర్భంగా హైదరాబాద్ నగర చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరానికి 430 ఏళ్ల కిందటే పునాది రాయి పడిందని, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు తోడు త్వరలో ఫోర్త్ సిటీ కూడా ఆవిర్భవించనున్నదని వివరించారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేవని, అందువల్లనే నగరం వేగంగా విస్తరిస్తూ పురోగతి సాధిస్తున్నదన్నారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని వివరించారు. ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాలను బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు.
ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. నవతరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేలా సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ఆ ఆలోచనలో భాగమే స్కిల్స్ యూనివర్సిటీ అని, దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రను ఛైర్మన్‌గా, మరో పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజును వైస్ ఛైర్మన్‌గా నియమించామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)తో పాటు హైదరాబాద్‌కు ఉన్న అన్ని అనుకూలతలను ముఖ్యమంత్రి వారికి వివరించారు.
ఫోర్త్ సిటీ ఫాక్స్ కాన్‌కు అనుకూలం :
ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్దతు అందజేస్తామని ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్ యాంగ్ లియూకి వివరించారు.
ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ వ్యాఖ్యానించారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో విజన్ అద్భుతంగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యంగ్ లియూ అభినందించారు. సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని, దానికి ముందే తమ కంపెనీ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి విన్సెంట్ లీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని తెలిపారు.
ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రమోషన్ ఎంగేజ్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ డాక్టర్ ఎస్కే శర్మ, ఫాక్స్ కాన్ నుంచి ఎస్బీజీ ప్రెసిడెంట్ బాబ్ చెన్, సీబీజీ జీఎం జో వూ, చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సీఎస్‌బీజీ డిప్యూటీ జీఎం సూ షొ కూ, సీ-గ్రూప్ మేనేజర్ సైమన్ సంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి విన్సెంట్ లీ తదితరులు పాల్గొన్నారు.