Skill University : ‘స్కిల్ యూనివర్సిటీ’ కోర్సుల కీలక నిర్ణయం.. దసరా నుంచే ప్రారంభం : సీఎస్

by Ramesh N |
Skill University : ‘స్కిల్ యూనివర్సిటీ’ కోర్సుల కీలక నిర్ణయం.. దసరా నుంచే ప్రారంభం : సీఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించడం జరిగిందని, వీటిలో దసరా పండగ నుండి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాల ఖరారు తదితర అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంత వరకు ఈ వర్సిటీని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

ఇందుకు గాను, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గానీ, నాక్ లేదా నిథమ్ లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీ ఛైర్-పర్సన్ గా ఆనంద్ మహీంద్రాను, శ్రీనివాస సి రాజు ను కో-ఛైర్మన్ గా నియమించడం జరిగిందని గుర్తుచేశారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని, దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా, తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్స్‌లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు

వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఏసీ, డాక్టర్ రెడ్డీస్, టీవీఏజీఏ, అదానీ గ్రూప్‌లు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించారని వీరితోపాటు ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ కూడా ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఈ యూనివర్సిటీకి సంబంధించిన లోగో ను, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ యూనివర్సిటీ లో కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేష్ రంజన్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed