Minister Ponnam : గుజరాత్ గులాములు మీరు..బండి సంజయ్ కి మంత్రి పొన్నం కౌంటర్

by Y. Venkata Narasimha Reddy |
Minister Ponnam : గుజరాత్ గులాములు మీరు..బండి సంజయ్ కి మంత్రి పొన్నం కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్(Congress) ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన విమర్శలను ట్విటర్ వేదికగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) తిప్పికొట్టారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాత్ గులాములు..హామీలు ఎగ్గొట్టటంలో, అప్పులు తేవడంలో మీరు ప్రపంచ రికార్డు సాధించారని బీజేపీ పాలనపై పొన్నం ఫైర్ అయ్యారు. రైతులకు ప్రతి నెల పింఛన్, పేదలకు ఉచిత విద్యుత్, సామాన్యుల ఎకౌంట్లో 15 లక్షల రూపాయలు, రెండు కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలు... ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఎగ్గొట్టిన హామీలు చిన్నో పిల్లాడిని అడిగినా చెప్తారని ఎద్దేవా చేశారు. ఇక అప్పుల విషయానికొస్తే.. మీరు తెచ్చిన 150 లక్షల కోట్ల అప్పులు దేశానికి గుదిబండగా మారాయని, ఏటా మీ అప్పులకు వడ్డీలు కట్టేందుకే 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని విమర్శించారు.

పదేండ్ల మీ పాలనలో విద్వేశ ప్రచారం, విధ్వంస చ‌ర్యలు త‌ప్ప దేశానికి మీరు చేసింది శూన్యమని, కానీ కోతలు, వాతలతో సామాన్యుల నడ్డి విరచడంలో మీరు నిష్ణాతులని మండిపడ్డారు. ఆడబిడ్డల ప్రసూతి ప్రయోజనాల్లో కోత, విద్యార్థుల స్కాలర్షిప్ లలో కోత, వయోవృద్ధుల రైలు ప్రయాణ రాయితీలకు కోత, రేషన్ కార్డుల్లో కోత, ఎరువుల సబ్సిడీలో కోత, గ్యాస్ సబ్సిడీలో కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత, ఫసల్ బీమా లో కోత, సెస్ ల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వాతలు మీ పాలన వైఫల్యానికి నిదర్శనాలని ఏకరవు పెట్టారు. అటువంటి మీరు 10 నెలల ప్రజా ప్రభుత్వంపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందని, చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడండని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించండని హితవు పలికారు. అంతేకానీ అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు గాక క్షమించదని హెచ్చరించారు.

Advertisement

Next Story