33 జిల్లాలు ఎవరు చేయమన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
33 జిల్లాలు ఎవరు చేయమన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:'ఏం లేనప్పుడే మునుగోడులో రాజీనామా చేసి మూడు నెలల పాటు బీఆర్ఎస్ వాళ్లకు చెమటలు పట్టించాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వారిని బయట తిరగనిస్తామా’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కమార్ రెడ్డి తరపున చేర్యాలలో ప్రచారం నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్ అయ్యా జాగిరి అయినట్లు తెలంగాణను 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. అల్లుడికి ఓ జిల్లా, కొడుకో జిల్లా ఇచ్చాడు. ఎవడు చేయమన్నాడు 33 జిల్లాలు. 20 జిల్లాలు చేస్తే చాలు. ఒకప్పుడు చేర్యాల, జనగామ అంటే ఎంత బాగుండేంది. ఈ హరీశ్ రావు ఇష్టం వచ్చినట్లు మండలాలు చేశాడు. చేర్యాల వాళ్లు ఒక పని మీద హుస్నాబాద్, మరో పని మీద సిద్దిపేట, ఇంకో పని కోసం మరో చోటకు వెళ్లాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఇదేమన్న హరీశ్ రావు జేబు సంస్థనా. ఎంపీ ఎన్నికలు అవ్వగానే హరీశ్ రావును కూడా బొక్కలో వేస్తామన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు ఎక్కువని, పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు. వీరందరిని జైలుకు పంపిస్తామన్నారు. వీరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచాడని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించి 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకుందని రేపు విచారణ జరిగి ఆ 39 మంది ఎమ్మెల్యేల పదవులు పోతాయని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతోందని చెప్పారు. లక్ష కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే ఎలా కూలింది. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు కాళేశ్వరం మీద ఎన్ని కమిషన్లు సంపాధించాడు? హరీశ్ రావు పొద్దున పొద్దునే తిరుగుతున్నాడు. ఇక తిరుగుడు బంజేసి జైల్లోకి వెళ్లి పడుకోవాలన్నారు. గతంలో ఈ ప్రాతం తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చిందని ఇప్పుడు నా తమ్ముడు చామల కిరణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే చెర్యాలకు డీలిమిటేషన్ లో భాగంగా నియోజకవర్గం చేస్తామన్నారు.

Advertisement

Next Story