కేటీఆర్ ఎక్కడా?.. త్రీడేస్ గా కనిపించని వర్కింగ్ ప్రెసిడెంట్

by Prasad Jukanti |
కేటీఆర్ ఎక్కడా?.. త్రీడేస్ గా కనిపించని వర్కింగ్ ప్రెసిడెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నాయి. ఓ వైపు ఎన్నికల గడువు ముంచుకు వస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాయబ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. గత మూడు రోజులుగా ఆయన కనిపించకపోగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో అడపదడపా రియాక్ట్ అవుతున్నా అవి కూడా నెటిజన్ల వ్యక్తిగత విషయాలే కావడంతో పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ ఎక్కడా అనే చర్చ జరుగుతోంది. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక గులాబీ శ్రేణులు అయోయానికి గురవుతున్నారు. ఇక హరీశ్ రావు ఒక్కరే అడపడదపా క్యాడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నా పార్టీ ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తండ్రి కొడుకుల కారణంగా పార్టీ మరింత డ్యామేజ్ తప్పదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్, బీజేపీ:

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఆ మేరకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా చేరికలతో జోరు పెంచేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. మరో వైపు విజయసంకల్ప యాత్ర ద్వారా బీజేపీ ప్రజాక్షేత్రంలోకి దూకింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య విమర్శల డోస్ క్రమంగా పెరుగుతుంటే బీఆర్ఎస్ మాత్రం ఎటువంటి కార్యక్రమాలు లేక సైలెంట్ గా ఉండే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకోబోతున్నదని ఈ విషయంలో త్వరలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో రోజు రకమైన ఊహాగానాలు వినిపిస్తున్నా బీఆర్ఎస్ అధిష్టానం మౌనం దేనికి సంకేతం? అనే ఆందోళన ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు క్యాడర్ లో సందేహాలకు తావిస్తోంది.

గడ్డుకాలం దాటేదెలా?:

ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. అతి త్వరలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారని, గోదావరి, కృష్ణా జలాలపై పోరు యాత్ర చేసేందుకు గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల నల్గొండలో కేఆర్ఎంబీ ఇష్యూపై భారీ బహిరంగ సభ నిర్వహించారు. మళ్లీ నీటి అంశాన్నే కేసీఆర్ ఎత్తుకోవడం ద్వారా పార్టీకి కలిసి వస్తుందా లేక కాళేశ్వరం వైఫల్యాలు, కేఆర్ఎంబీ విషయంలో అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాల రూపంలో బెడిసి కొడుతుందా అనేది సొంత పార్టీలో చర్చగా మారింది. బీఆర్ఎస్ ను ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు మైండ్ గేమ్ తో చుట్టుముడుతున్న వేళ బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు ఇది అత్యంత గడ్డుకాలం అని ఈ పరిస్థితిని తండ్రి కొడుకులు ఎలా అధిగమిస్తారనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed