మునుగోడు రిజల్ట్.. కోమటిరెడ్డి దారెటు?

by Nagaya |   ( Updated:2022-11-06 12:02:27.0  )
మునుగోడు రిజల్ట్.. కోమటిరెడ్డి దారెటు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తేలిపోవడంతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దారెటు అన్న దానిపై చర్చ మొదలైంది. మునుగోడు బై పోల్ వ్యవహారంలో టీఆర్ఎస్, బీజేపీ తర్వాత అంతటి స్థాయిలో చర్చ జరిగింది కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపైనే. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వెంకట్ రెడ్డి వైఖరిపై సర్వత్రా చర్చమొదలైంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలతో వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరం అయ్యారు. పార్టీని పక్కన పెట్టి ఈ సారికి తన సోదరుడికి గెలిపించాలని ఆయన రహస్యంగా ప్రచారం చేశారంటూ ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం తీవ్ర దుమారం రేపింది.

పార్టీ నేతలు ఎంత సర్ది చెప్పినా వినిపించుకోని వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని ఖాతరు చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారానికి రావాలని ఆహ్వానించిన వెంకట్ రెడ్డి రాలేదు. ప్రచారానికి రాకపోగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం, ఓడిపోబోయే పార్టీకి ప్రచారం చేయడం ఏంటని ఆయన చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం హల్ చల్ చేశాయి. ప్రచారాన్ని, పార్టీని కాదని ఆస్ట్రేలియా వెళ్లిన వెంకట్ రెడ్డి పోలింగ్ కు సరిగ్గా ఒక్కరోజు ముందు తిరిగి రాష్ట్రానికి తిరిగి రావడం చర్చనీయాశం అయింది. కాగా, మునుగోడులో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలవడంతో ఆయన దారెటు అనే చర్చ జరుగుతోంది.

సోదరుడి ఓటమితో మునుపటిలా కాంగ్రెస్ లో కొనసాగుతారా? లేక మరేదైనా కారణం చెప్పి పార్టీని వీడుతారా అనేది సందేహంగా మారింది. మునుగోడు బై పోల్ సమయంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, దీనిపై సమాధానం చెప్పాలని అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చి ఉంటే ఆ వివరణపై పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. వెంకట్ రెడ్డి వ్యవహారం పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని, కీలక సమయంలో ఆయన పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని హస్తం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కన్నతల్లిలాంటి పార్టీకి వెంకట్ రెడ్డి ద్రోహం చేశారని ఇలాంటి చర్యలు సహించరాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను నిఖార్సైన కాంగ్రెస్ వాదినని తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వీడేది లేదని గతంలో వెంకట్ రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.

రాజకీయాలకు వెంకట్ రెడ్డి గుడ్ బై?

మునుగోడు ఫలితంతో వెంకట్ రెడ్డి రాజకీయాలకు దూరం కాబోతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఆడియో క్లిప్ వ్యవహారం తెరపైకి వచ్చిన సందర్భంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన వెంకట్ రెడ్డి అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానన్నారు. 25 ఏళ్ల పాటు రాజకీయ పదవుల్లో ఉన్నానని ఇక తనకు చాలు అన్నట్టుగా మాట్లాడటంతో ఆయన రాజకీయాలకు దూరం కాబోతున్నట్టు చర్చ జరిగింది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే పరిస్థితి మరోలా ఉండేదని, కానీ ఓటమి పాలవడంతో కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఒక వేళ కాంగ్రస్ లో కొనసాగితే మునుపటిలా మిగతా వారు ఆయనతో సఖ్యతగా ఉంటారా? అనేది సందేహంగా మారింది. ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోమటిరెడ్డి బ్రదర్స్ ను ముందే హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి తాను వెళ్తు వెళ్తూ తన అన్న వెంకట్ రెడ్డిని సైతం రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నాడని వీహెచ్ చెప్పిన మాటలే ఇప్పుడు నిజం అయ్యాయనే టాక్ హస్తం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.


బిగ్ బ్రేకింగ్ న్యూస్: మునుగోడులో TRS ఘన విజయం...ఉమ్మడి నల్గొండ జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన గులాబీ బాస్...రివర్సైన రాజగోపాల్ రెడ్డి ప్లాన్.. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

Advertisement

Next Story

Most Viewed