- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబ్బురపరిచేది ఎప్పుడు? మూడేండ్ల క్రితం ప్రకటించిన KCR
'తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతి పెద్ద తీపి కబురు చెప్పబోతా ఉన్న. దానికి సంబంధించిన ఫైనాన్స్ అంతా వర్కవుట్ అయింది. వారం రోజుల్లోనే లెక్కాచారమంతా తీసి భారతదేశమే అడ్డంపడే, ఆశ్చర్యపడే వార్త ఒకటి చెప్తాను. అందరూ ఓపికపట్టాలె. ప్రపంచంలోనే రైతాంగానికి ఎక్కడా లేనటువంటి మంచి మాటను చెప్పబోతున్నా. వారం రోజులు దాన్ని సస్పెన్స్ గానే ఉంచుదాం'
- సీఎం కేసీఆర్ (29 మే 2020, కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి..)
దిశ, తెలంగాణ బ్యూరో : కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా 2020 మే 29న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అప్పట్లో సంచలనంగా మారింది. దేశం అడ్డంపడే, ఆశ్యర్యపడే వార్త ఒకటి చెబుతానని ప్రకటించారు. అది రైతాంగం కోసమేనన్నట్టు హింట్ ఇచ్చారు. వారం రోజులు ఓపికపట్టాలన్నారు. కానీ ఇప్పటికి 140 వారాలు గడిచాయి. కానీ దానిపై సీఎం ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు. మరో వారం రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సంచలన వార్తను అప్పుడైనా ప్రకటిస్తారా? లేక ఎన్నికల ప్రచార సభల్లో అనౌన్స్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అధికారంలోకి రావడం కోసం ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సూచనప్రాయంగా కొన్ని స్కీమ్‌లను (హామీలు) ప్రకటించాయి.
కానీ బీఆర్ఎస్ మాత్రం నిర్దిష్టంగా అలాంటి సరికొత్త సంచలన పథకం గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. జాతీయ స్థాయికి పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. దానికి ఒక టాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ రైతు కేంద్రంగానే పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసి చనిపోయిన పంజాబ్, హర్యానా, యూపీ రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో ఆర్థిక సాయాన్నీ అందించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కొన్ని రైతు సంఘాల ప్రతినిధులకు ఇప్పటికే బీఆర్ఎస్ తరపున టాస్క్ అప్పగించారు. కిసాన్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు.
రైతుల కోసమే?
మూడేండ్ల క్రితం కేసీఆర్ చెప్పిన స్కీమ్.. రైతులు, వ్యవసాయానికి సంబంధించినదేనన్న ఊహాగానాలు అప్పట్లోనే వెలువడ్డాయి. ఇప్పుడు 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అని నినదిస్తున్నందున ఆ ఊహాగానాలకు బలం చేకూరుతున్నది. రైతుబంధు సమితుల ఏర్పాటు సమయంలో కేసీఆర్ అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించి స్పష్టమైన హామీ ఇచ్చారు. రైతులకు ఇకపైన ఉచితంగానే యూరియా, డీఏపీ, పొటాష్ లాంటి ఎరువులను అందిస్తామన్నారు. సుమారు 25 లక్షల టన్నులు అవసరమవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు.
కానీ ఆ హామీ అక్కడికే పరిమితమైంది. బీఆర్ఎస్ పేరును లాంఛనంగా ప్రకటించిన తర్వాత రైతు కేంద్రంగా ప్రకటించబోయే హామీ దేశంలోనే వినూత్నంగా ఉంటుందని ఆ పార్టీ వర్గాల ద్వారా లీకైంది. ప్రస్తుతం వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పింఛను తరహాలోనే సొంత భూమి ఉన్న రైతులందరికీ ప్రతి నెలా పింఛను (కిసాన్ పెన్షన్) స్కీమ్‌ను ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడే ప్రకటిస్తే అది జనంలో పాతపడుతుందని, ఆ కారణంగానే బడ్జెట్‌లో పెట్టకుండా నేరుగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా భారీ బహిరంగసభలో స్వయంగా కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశముందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. దేశం అబ్బురపడే స్కీమ్ ఇది కాకుండా ఇంకేదైనా ఉందా? అనే సస్పెన్స్ కూడా కొసాగుతున్నది.
కాంగ్రెస్, బీజేపీ హామీలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరుతో కొన్ని పథకాలను (హామీలు) ప్రకటించింది. రుణమాఫీ, వడ్ల కొనుగోళ్ల సందర్భంగా రైతులకు బోనస్ లాంటివి ప్రకటించింది. ఆ తర్వాత భారత్ జోడో యాత్ర సందర్భంగా ధరణి రద్దుపై స్పష్టమైన ప్రకటన చేసింది. ఇక బీజేపీ కూడా ఇలాంటి హామీలనే గుప్పించింది. రైతు రుణమాఫీతో పాటు ధరణి రద్దు, ఉచిత విద్య, ఉచిత వైద్యం తదితర హామీలను ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ మాత్రం అలాంటి హామీలను ఇప్పటివరకూ ఇవ్వలేదు. దీంతో దేశం అబ్బురపడే స్కీమ్ ఈసారి పార్టీకి బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడేదిగా ఉంటుందని, ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణవైపు చూసేలా ఉంటుందని గులాబీ పార్టీ వర్గాల సమాచారం.
స్కీం ప్రకటిస్తే నిధులెలా?
హుజూరాబాద్ బైపోల్ తర్వాత బీజేపీతో కేసీఆర్‌కు రాజకీయపరంగా దూరం పెరిగింది. అది చివరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనా మేరకు రుణాలు అందలేదు. కేంద్రం నుంచి గ్రాంట్లు కూడా రాలేదు. ఫండ్స్ కోసం రాష్ట్రప్రభుత్వం ఇబ్బంది పడుతున్నది. ఇప్పటికే ప్రకటించిన దళితబంధు స్కీమ్‌కు రూ.17 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించినా.. ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. రానున్న కాలంలోనూ కేంద్రం నుంచి గ్రాంట్లు, ఆర్బీఐ ద్వారా రుణాలు అంచనా మేరకు వస్తాయన్న నమ్మకం కూడా లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో సంచలన స్కీమ్‌ను ప్రకటిస్తే దానికి అవసరమైన నిధుల సమీకరణ ఎలా అనేది కూడా కీలకంగా మారింది. ఈ కారణంగానే ఆ స్కీమ్ ఏంటో, దేనికి సంబంధించినదో, ఎన్ని నిధులు అవసరమవుతాయో అనే చర్చలు తాజాగా బడ్జెట్ రూపకల్పన సందర్భంగా తెరమీదకు వచ్చాయి. వారం రోజులు సస్పెన్స్‌లో పెడదాం అని మూడేండ్ల క్రితం చెప్పిన కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ అదే స్థితిని కొనసాగిస్తారా? లేక తొందర్లోనే సస్పెన్స్‌కు తెర దించుతారా? అనేది ఉత్కంఠగా మారింది.
Also Read...