బీఆర్ఎస్ ఆవిర్భావం ఎప్పుడు?

by Mahesh |   ( Updated:2023-04-10 15:30:32.0  )
బీఆర్ఎస్ ఆవిర్భావం ఎప్పుడు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ఆవిర్భావ వేడుకలను ఏప్రిల్ 27న నిర్వహించుకోవాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాలుగా సైతం అదే రోజు పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఆ రోజే పార్టీ ప్లీనరీ సమావేశాలను సైతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చారు. గత అక్టోబర్ 5న విజయదశమి రోజు ఈ నిర్ణయాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 9న అధికారికంగా కొత్త పేరును గుర్తించింది. దీంతో ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే బీఆర్ఎస్ ఆవిర్భవించిన అక్టోబర్ 5న బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చిన సందర్భం ఏమవుతుందనే దానిపై క్యాడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్టోబర్ 5న జరుపుకోవడమే సమంజసంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్లీనరీ వాయిదా వెనుక..!

ఆవిర్భావ వేడుకలను ఏప్రిల్ 27న జరుపుకుంటున్నా ప్లీనరీ సమావేశాలను వాయిదా వేయడం వెనుక ఆంతర్యం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. నిజానికి ప్లీనరీ యధాతథంగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలోనే ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సుమారు మూడు వేల మంది ప్రతినిధులు హాజరయ్యేలా నిర్వహించనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇందుకోసం డెలిగేట్స్‌కు పాసులు జారీ చేస్తామని, ఆహ్వానం అందుకున్నవారు మాత్రమే హాజరుకావాలని సూచించారు. ఇంత ప్లానింగ్ ఇచ్చినా చివరకు ప్లీనరీ సమావేశాలు ఉండవని, ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరణకు మాత్రమే పరిమితమవుతాయని ఆదివారం ప్రకటించడం ఈ కన్ఫ్యూజన్ కు కారణమైంది.

అనేక అనుమానాలు..

వేసవి ఎండల తీవ్రత, వరి కోతల కారణంగా ప్లీనరీ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరిగే ప్లీనరీ సమావేశాల్లో ఎండలు ఎక్కువగానే ఉంటాయి. వరి కోతలు కూడా ముమ్మరంగానే కొనసాగుతాయి. ఇంతకాలం ఇదే ప్రాక్టీస్ కొనసాగింది. కానీ ఈసారి మాత్రం ఆవిర్భావ దినోత్సవం యధాతథంగా కొనసాగుతూనే ప్లీనరీని మాత్రమే వాయిదా వేయడం వెనుక ఉద్దేశం పార్టీ శ్రేణులకు స్పష్టత కంటే అనుమానాలకే తావిచ్చినట్లయింది. సభకు హాజరయ్యేది పార్టీ శ్రేణులే అయినందున వేసవి ఎండలు, వరికోతలతో వారికి సంబంధం లేదనేది నేతలకు తెలియని విషయమేమీ కాదు. కానీ కేటీఆర్ ప్రస్తావించిన లాజిక్ వారికి సహేతుకం అనిపించడం లేదు.

జనరల్ బాడీ మీటింగ్..

ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకలకు ప్లీనరీ స్థానంలో జనరల్ బాడీ సమావేశం మాత్రమే జరగనున్నది. పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జెండా ఎగురవేసి ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది ప్రతినిధులు హాజరవుతారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ పార్టీకి కూడా వర్తింపజేయడంలోని మతలబు పార్టీ నేతలకు అర్థం కాలేదు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ లాంఛనంగా ప్రకటన చేసింది అక్టోబర్ 5న కావడంతో కొత్త పార్టీ ఆ రోజు నుంచే ఉనికిలోకి వచ్చిందనేది ఏప్రిల్ 27 ఆవిర్భావ దినోత్సవంతో విభేదిస్తున్న నాయకుల వాదన. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తే అక్టోబర్ 5న ప్రకటన చేసిన రోజు ప్రాధాన్యత ఏంటనేది వారి సందేహం.

టీఆర్ఎస్ ఉనికిలో లేనప్పుడు అదే తేదీన కొత్త పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అర్థం లేనిదే అవుతుందనేది వారి అభిప్రాయం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనలోని అనిశ్చితి, మార్పులు పార్టీ నేతల్లో సరికొత్త కన్‌ఫ్యూజన్‌ను సృష్టించింది. బీఆర్ఎస్ పేరును లాంఛనంగా ప్రకటించిన అక్టోబర్ 5న పార్టీ కార్యక్రమం ఏముంటుందనే ఆసక్తి నెలకొంది. ఆవిర్భావ దినోత్సవం రోజున ప్లీనరీ జరిపే సంప్రదాయం ఈసారి గాడి తప్పినందున అక్టోబరు 10న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను ప్లీనరీ పేరుతో నిర్వహిస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read..

బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటుపై జూపల్లి హాట్ కామెంట్స్

Advertisement

Next Story