- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా రిజర్వేషన్‌పై అసలు BRS వైఖరేంటి.. KCR ఈ సారి ఆ పని చేసి ఆదర్శంగా నిలుస్తారా..?
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కోసం భారత్ జాగృతి శుక్రవారం చేయనున్న దీక్షకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.2017లో లోక్‌సభలోనూ ఈ బిల్లుకు గులాబీ పార్టీ సపోర్ట్ చేసింది. కానీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపు, మంత్రి పదవుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యతనివ్వలేదు. బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలోనూ తీర్మానం చేయలేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఇప్పటి వరకు ఏ ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు కూడా ‘జాగృతి దీక్షకు మద్దతు తెలుపుతున్నామే తప్పా.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.’ అని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం.
టికెట్ల కేటాయింపులో కానరాని ప్రాధాన్యత
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పాటుపడతామని బీఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నది. కానీ 2014లో ఆరుగురికి, 2018లో నలుగురు మహిళలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. 2018లో రేఖానాయక్, గొంగిడి సునీత, పద్మా దేవేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలవగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియా నాయక్ ఆ తర్వాత కారెక్కారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన సీతక్క యథావిధిగా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
మొత్తం 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలున్నారు. తొలి దఫా మంత్రివర్గంలోనూ ఒక్క మహిళకు కూడా బీఆర్ఎస్ అవకాశమివ్వలేదు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డిని నియమించి సరిపెట్టుకున్నది. సెకండ్ టర్ములో మాత్రం ఇద్దరు మహిళలకు కేబినెట్‌లో స్థానం కల్పించింది.
ఒత్తిడి తీసుకురాకుండా..
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే కసరత్తు జాతీయ స్థాయిలో 1996లోనే పార్లమెంటు వేదికగా మొదలైంది. రాజ్యసభలో ఆమోదం లభించినా లోక్‌సభలో ఓటింగ్ జరగకుండా నిలిచిపోయింది. 2017లో ఈ బిల్లుకు గులాబీ పార్టీ మద్దతు పలికింది. ప్రస్తుతం భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్‌లో కవిత తలపెట్టిన దీక్ష తరహాలో బీఆర్ఎస్ ఎన్నడూ ఈ బిల్లుపై ఒత్తిడి పెంచేలా ఇలాంటి జాతీయ స్థాయి ప్రదర్శనలకు సిద్ధం కాలేదు.
ఇతర పదవుల్లోనూ..
2014 లోక్‌సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత మాత్రమే బీఆర్ఎస్ తరఫున ఏకైక మహిళా ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో మాలోతు కవిత సింగిల్ ఉమన్ ఎంపీగా ఉన్నారు. 2014-19 మధ్య రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలకు కలిపి మొత్తం 9 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటే, ప్రస్తుతం ఆరుగురే ఉన్నారు. కౌన్సిల్‌లో 40 మందిలో తొలి టర్ములో కేవలం ఆకుల లలిత మాత్రమే ఎమ్మెల్సీగా ఉంటే, ఇప్పుడు ముగ్గురు (కల్వకుంట్ల కవిత, సురభి వాణిదేవి, సత్యవతి రాథోడ్) ఉన్నారు. ఇప్పటివరకు రాజ్యసభలో మహిళలకు బీఆర్ఎస్ అవకాశమే ఇవ్వలేదు.
అసెంబ్లీలో తీర్మానం చేయడంలో విఫలం
అనేక కీలక అంశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్‌లో తీర్మానాలు చేసి పంపడం ఆనవాయితీగా మారింది. ఎస్టీ రిజర్వేషన్ పెంపు, సాగు చట్టాలు, సీఏఏ-ఎన్‌పీఆర్-ఎన్ఆర్‌సీ, పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడికి నిరసన, బీసీ జనగణన, విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా, పీవీ నర్సింహారావుకు ‘భారతరత్న’, కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం, పార్లమెంటు భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్క్‌ర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.. ఇలాంటి దాదాపు పది తీర్మానాలు రెండో టర్ములో అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించింది. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మాత్రం ఒక్క తీర్మానాన్ని కూడా పెట్టలేదు.
మద్దతు వరకేనా?
జంతర్ మంతర్ వద్ద కవిత శుక్రవారం చేయనున్న ఒకరోజు దీక్షకు 18 పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. బీఆర్ఎస్ తరపున మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరవుతున్నారు. పార్టీ తరఫున కాకుండా భారత్ జాగృతి బ్యానర్‌పై కవిత జాతీయ స్థాయిలో దీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ వైఖరి మద్దతు వరకేనా అనే చర్చలు మొదలయ్యాయి. మేనిఫెస్టోలో పెట్టినా దానిపై చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదన్న అపవాదును పార్టీ మూటగట్టుకుంటున్నది.
ఈ సారైనా టికెట్లు పెరుగుతాయా..?
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టంతో సంబంధం లేకుండా టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది. పార్టీ అధినేత కుమార్తె కవిత ఢిల్లీలో దీక్ష చేస్తున్న నేపథ్యంలో తన తండ్రిపై ఏ మేరకు ఒత్తిడి తెస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీల నుంచి దీక్షకు సహకారం కోరుతున్నందున చట్టంతో సంబంధం లేకుండా ఒక విధానంగానే బీఆర్ఎస్ తరఫున 33% టికెట్లు మహిళలకు దక్కేలా కవిత చొరవ తీసుకుంటారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అంతేకాకుండా సీఎం కేసీఆరే ఈసారి 33% శాతం టికెట్లను మహిళలకు కేటాయించి ఆదర్శంగా నిలుస్తారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.