‘ప్రైవేటు వర్శిటీ’ విద్యార్థుల పరిస్థితేంటి!

by Mahesh |
‘ప్రైవేటు వర్శిటీ’ విద్యార్థుల పరిస్థితేంటి!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత ఏడాది సెప్టెంబర్ లో ప్రైవేటు వర్శిటీల సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. కొత్తగా 6 ప్రైవేటు వర్శిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించకపోయినా రాష్ట్రంలో ఓ కీలక మంత్రి అండతో గురునానక్, శ్రీనిధి విద్యాసంస్థలు ఏర్పాటైనట్లు తెలుస్తున్నది. 2022–23 అకాడమిక్ ఇయర్‌కు అడ్మిషన్లు కూడా చేపట్టినట్లు సమాచారం. రూ. వందల కోట్లను ఫీజుల రూపంలో వసూలు చేశారని తెలిసింది.

బిల్లుకు ఆమోదం లభించకుండా అడ్మిషన్లు ఎలా చేపడతారని ప్రభుత్వానికి వందలాది ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. కొందరు సీనియర్ అధికారులు సైతం వర్శిటీలను ప్రశ్నిస్తే సదరు అధికారులకు ఆ కీలక మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే విషయంపై కొందరు పేరెంట్స్ వర్శిటీలను ప్రశ్నిస్తే తమకు ‘తమకు ఓ కీలక మంత్రి అండ ఉంది. అంతా ఆయనే చూసుకుంటారు.’ అని భరోసా ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది.

3 వేల మంది విద్యార్థుల భవిష్యత్తేమిటి?

2022–23 అకాడమిక్ ఇయర్‌కు గురునానక్, శ్రీనిధి సంస్థలు వివిధ కోర్సుల కింద సుమారు 3 వేల మందికి అడ్మిషన్లు ఇచ్చినట్లు తెలిసింది. అయితే వర్శిటీల ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ఏంటీ అనే చర్చ జరుగుతున్నది. యూజీసీ అనుమతి లేకుండా పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. కానీ ఈ మధ్యే ఆ రెండు వర్సిటీలు పిల్లలకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాయి. ఇదంతా పిల్లలు, వారి పేరెంట్స్ ను మభ్యపెట్టేందుకే చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

నిబంధనలు పాటించకుండా..

ప్రైవేట్ వర్శిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించాలి. బిల్డింగ్ నిర్మాణం, టీచింగ్ స్టాఫ్, ఖాళీ స్థలంతో పాటు ఇతర వసతులు రూల్స్ ప్రకారం ఉండాలి. కానీ గురునానక్, శ్రీనిధి వర్సిటీలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్ నిర్మించినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. అయితే ఓ కీలక మంత్రి అండ ఉండడంతో మౌనంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఇన్ని ఆరోపణలు రావడంతోనే గవర్నర్ ప్రైవేటు వర్శిటీల బిల్లుకు అనుమతి ఇవ్వలేదని టాక్.

చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్‌ను ఉల్లంఘించి, యూజీసీ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్, శ్రీనిధి యూనివర్శిటీలపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే జేఎన్టీయూహెచ్ అనుబంధంగా ఉన్న ఆటోనొమస్ కాలేజీలో యూనివర్సిటీ చూపించడం ఎలా సాధ్యం? పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. విద్యార్థులు నష్టపోకుండా ఇతర కాలేజీలకు మొబిలిటీ అవకాశం ఇవ్వాలి:- అయినేని సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, టీఎస్ టీసీఈఏ

Advertisement

Next Story