మాపై వేరే అధికారుల పెత్తనం ఏంటి.. నల్లగొండలో డాక్టర్ల ఆందోళన

by Bhoopathi Nagaiah |
మాపై వేరే అధికారుల పెత్తనం ఏంటి.. నల్లగొండలో డాక్టర్ల ఆందోళన
X

దిశ, నల్లగొండ: వైద్యశాఖపై ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణ ఏంటని నల్లగొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. వైద్యంపై ఎలాంటి అవగాహనలేని అధికారులు వచ్చి తమను పర్యవేస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం కలెక్టర్, జాయంట్ కలెక్టర్ మాత్రమే పర్యవేక్షించే అవకాశం ఉందని ఆందోళనకు దిగారు. గురువారం నల్లగొండలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు బంద్ చేసి డాక్టర్లు, సిబ్బంది ధర్నాకు దిగారు.

వైద్యుల ఆందోళనకు కారణమిదే..

వారం రోజుల క్రితం కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో వైద్య సేవలు, విధుల నిర్వహన సరిగా లేదని తేలింది. దీంతో అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్రతోపాటు వివిధ శాఖలకు చెందిన మరో 45 మంది అధికారులను అబ్జర్వర్లుగా కలెక్టర్ నియమించారు. నిత్యం ఆయా అధికారులు ఆస్పత్రిలో జరుగుతున్న సేవలను పర్యవేక్షిస్తున్నారు. వైద్య సిబ్బంది పని వేళలు, సేవలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో విధుల్లో అలసత్వం వహించిన ఐసీయూ ఇంచార్జి రమేష్ మీద చర్యలు తీసుకోవడంతోపాటు కొంతమంది శానిటేషన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. దీంతో ఆగ్రహం చెందిన వైద్యులు, సిబ్బంది ఇవాళ వైద్యసేవలను బహిష్కరించి ఆస్పత్రి గేటు ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న జేసీ పూర్ణచంద్ర ఆస్పత్రికి చేరుకుని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కానీ జేసీ ఎదుట వైద్యులు ఆందోళనకు దిగారు. జిల్లాలో ఏ ఆస్పత్రిలో లేని పర్యవేక్షణ ఇక్కడే ఎందకని ప్రశ్నించారు. ఇతర శాఖల అధికారుల వైద్యులను ఎలా పర్యవేక్షిస్తారని నిలదీశారు. కలెక్టర్ ఈ నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు అత్యవసర సేవలు మినహా ఏ వైద్యసేవలు చేయబోమని భీష్మించుకుని కూర్చున్నారు. మిగతా శాఖలను వదిలేసి వైద్య శాఖలో మాత్రమే బయోమెట్రిక్ పెట్టడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు శానిటేషన్ సిబ్బంది జేసీ కాళ్లు పట్టుకొని మా పొట్ట కొట్టొద్దు అంటూ బతిమిలాడారు. ఉద్యోగం నుంచి తొలగించవద్దని వేడుకున్నారు.

Advertisement

Next Story