దసరా లోపు వారి బదిలీల ప్రక్రియ.. మంత్రి పొంగులేటి హామీ

by Mahesh |
దసరా లోపు వారి బదిలీల ప్రక్రియ.. మంత్రి పొంగులేటి హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ అయిన తహశీల్దార్లు ఇతర జిల్లాలో పని చేస్తున్నారని, కుటుంబాలు పూర్వ జిల్లాలో నివసిస్తున్నారని రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు అక్కడే చదువుకుంటున్నారని, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి ఇబ్బందులను గుర్తు చేశారు. రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రెసా తరపున హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్‌లతో కూడిన ప్రతినిధి బృందం రెవెన్యూ పలు అపరిష్కృత సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లింది.

ఇప్పటికే ఈ విషయంపై ట్రెసా తరపున పలుమార్లు విన్నవించామని, కావున దసరా పండగ లోపు తహశీల్దార్ల బదిలీలు చేపట్టి వారి కుటుంబాలలో సంతోషం నింపాలని ట్రెసా ప్రతినిధులు కోరగా, ఈ విషయంపై పూర్తి సానుకూలంగా స్పందించిన రెవెన్యూ మంత్రి వేదిక మీదనే ఉన్న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ని రేపో, ఎల్లుండో ముఖ్యమైన సంఘ నాయకులతో చర్చించి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. తహశీల్దార్ల బదిలీలు త్వరలో చేపడతామని వీలైతే దసరా పండగ లోపు బదిలీలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే విధి నిర్వహణలో భాగంగా తహశీల్దార్లు/ఆర్డీవోలపై పోలీసు కేసుల నమోదు విషయంపై కలెక్టర్ ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో సహా అన్ని కేడర్ల ప్రమోషన్లపై మంత్రి సానుకూలంగా హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed