Harish Rao : ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన ఇళ్ల సంగతేంటి? : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన ఇళ్ల సంగతేంటి? : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోఅనుమతులున్న ఇండ్లు కూల్చం, కొత్తవి మాత్రమే కట్టనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), హైడ్రా కమిషనర్ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath)లకు చెప్తున్నారని మరి ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన పేదల ఇళ్ల సంగతేంటని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం పుస్తకాలు తెచ్చుకుంటానని పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా హైడ్రా ఇండ్లను కూల్చిందని, ఆ పాపానికి బాధ్యులెవరని, చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో చెప్పాలని నిలదీశారు. కోర్టు మొట్టికాయాలు వేస్తే మీ నిర్ణయం మారవచ్చని, హైడ్రా బాధితులు పడిన బాధ ఎలా తీరుస్తారని, కూల్చిన పేదల ఇండ్లకు పరిహారం చెల్లించాల్సిందేనన్నారు. మూసీ పరిధిలో కూడా చట్టం చూసుకోకుండా, పార్లమెంటును తప్పదోవ పట్టించి దుందుడుకు చర్యలతో రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూల్చి దేశంలో రాష్ట్రం పరువు తీశాడని, పేదల ఉసురు పోసుకున్నాడని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ లో 2013భూసేకరణ చట్టం పాటిస్తున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంటును రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుదోవ పట్టించాడన్నారు. మూసీ బాధితుల పక్షాన పార్లమెంటులో ప్రివిలైజ్ మోషన్ పెడుతామని, న్యాయ పోరాటం చేస్తామని, డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ప్రకటించారు. హైడ్రా, మూసీ బాధితుల సమస్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధమని, ఎక్కడకు రమ్మంటారో చెప్పాలని సవాల్ చేశారు. మూసీ బాధితుల సమస్యలపై ఆల్ పార్టీ మీటింగ్ పెడుతా అని ఎందుకు పెట్టలేదని, ఇప్పుడు పెట్టాలని డిమాండ్ చేశారు.

సోనియాగాంధీ మీద రేవంత్ కు ప్రేమ ఉంటే ఆమె తెచ్చిన 2013భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లో మెరుగైన భూసేకరణ చట్టంతో ఆర్ ఆండ్ ఆర్ లో మార్పులు చేశారన్నారు. నిర్వాసితులను గుర్తించి 60రోజుల పీఎన్ నోటిఫికేషన్ చేసి, అభ్యంతరాల పిదప పీడీ నోటిఫికేషన్ ఇచ్చి పనులు ప్రారంభించాల్సి ఉండగా మూసీ పరిధిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీపీఆర్, నిర్వాసితుల గుర్తింపు జరుగకుండానే నోటీఫికేషన్లు లేకుండానే మూసీలో ఇండ్లను కూల్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తరలించారన్నారు. అంటే 2013, 2014చట్టాలకు విరుద్దంగా మూసీలో ఇండ్లను కూల్చి పార్లమెంటును, ప్రజలను, సోనియాగాంధీని మోసం చేశారని విమర్శించారు. మూసీ బాధితుడు ముజాహిద్ కుటుంబంలో వివాహితులైన వారికి ఐదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాల్సి ఉండగా ఒక ఇళ్లు మాత్రమే ఇచ్చాడని, ఉపాధి కల్పన కింద 37లక్షలు రేవంత్ రెడ్డి ఎగవేశారన్నారు. మూసీ పునరుజ్జీవనానికి మేం వ్యతిరేకం కాదని, మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన ప్రారంభించిందే తాము అని గుర్తు చేశారు.

Advertisement

Next Story