రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తాం : మంత్రి తుమ్మల

by Y. Venkata Narasimha Reddy |
రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తాం : మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్ డెస్క్ : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్దారు. మోడీకి తెలంగాణ రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల రుణమాఫీ కనిపించడంలేదా అని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు.

హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే, అధికారంలోకి రావాలనే బాధ ఇంకోకరిదని ఎద్దేవా చేశారు. తాము నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నామని, ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తాకేదే కదా అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed