Chennai air show: ఎయిర్ షో ప్రమాద ఘటనను రాజకీయం చేయాల్సిన పనిలేదు- డీఎంకే

by Shamantha N |
Chennai air show: ఎయిర్ షో ప్రమాద ఘటనను రాజకీయం చేయాల్సిన పనిలేదు- డీఎంకే
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వైమానిక దళం నిర్వహించిన ఎయిర్‌ షోలో విషాదం జరిగింది. ఎయిర్ షో లో ఐదుగురు చనిపోయారు. దీంతో డీఎంకే ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. తొక్కిసలాట, నిర్వహణలోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని తమిళనాడు ప్రభుత్వం ఆ విమర్శలకు చెక్ పెట్టింది. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన చాలామంది డిశ్చార్జి అయ్యారని, రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని డీఎంకే నేత శరవణన్‌ అన్నాదురై వెల్లడించారు. ‘‘ఈ ఈవెంట్‌ను తగినరీతిలో నిర్వహించాం. ఐదుగురు మృతి చెందడానికి గల కారణాలను విచారిస్తున్నాం. షో సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రజలు ఎక్కువదూరం నడవాల్సి వచ్చింది. ఈ ఘటనను రాజకీయం చేసేందుకే డీఎంకే ప్రభుత్వాన్ని నిందిస్తుంది’’ అని శరవణన్ స్పందించారు. ఈఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్ షో చూసేందుకు వచ్చి రద్దీ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఐదుగురు మృతి చెందారనే వార్తలు ఎంతగానో కలచివేశాయి. నిర్వహణ సాధ్యం కాని సమూహాలను నివారించాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఐదుగురు మృతి

మెరీనా బీచ్ లో భారీగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆదివారం సుమారు 15 లక్షల మంది వచ్చినట్లు రక్షణదళాలు ప్రకటించాయి. సముద్రతీరం వెంబడి 14-15 కి.మీ. మేర జనాలు గుమిగూడారు. ప్రారంభ సమయానికే రద్దీ వల్ల చాలా దారులు మూసుకుపోయాయి. కార్యక్రమం పూర్తవగానే ఎవరూ, ఎటూ వెళ్లలేని పరిస్థితి. బీచ్‌ రోడ్డులో నీటివసతి లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో బాధితుల సంఖ్య పెరిగింది. ట్రాఫిక్‌ ఇబ్బందులను తప్పించుకునేందుకు చాలామంది సబర్బన్, మెట్రో రైళ్లను ఆశ్రయించగా.. ఆ స్టేషన్లలోనూ భారీగా తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీనిపై అన్నాడీఎంకే, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. సరైన ఏర్పాట్లు, సరిపడినంత పోలీసుల బలగాలు లేవని అన్నాడీఎంకే నేత పళనిస్వామి అన్నారు. ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారని, తాగునీరు దొరకక పోవడంతో పాటు అనేక మంది వడదెబ్బ తగిలి ఆసుపత్రుల పాలయ్యారనే వార్త దిగ్భ్రాంతిని కలిగిస్తోందన్నారు. ఈ ఘటనకు కారణం డీఎంకే ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై కూడా డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యమే ఘటనకు కారణమని నిప్పులు చెరిగారు. సరైన సౌకర్యాలు ఉంటే.. ఈ దారుణం జరిగేది కాదని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా కీలకనేతలు రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

Advertisement

Next Story

Most Viewed