ఏడాదంతా క్రికెట్ ఆడిస్తాం : హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జ‌గ‌న్‌మోహ‌న్ రావు

by M.Rajitha |
ఏడాదంతా క్రికెట్ ఆడిస్తాం : హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జ‌గ‌న్‌మోహ‌న్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఔత్సాహిక క్రికెట‌ర్లను ప్రోత్సహించ‌డం త‌ప్ప త‌మ కార్యవ‌ర్గానికి మ‌రో ఎజెండా లేద‌ని, అందుకే ఏడాదంతా క్రికెట్ ఆడిస్తామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జ‌గ‌న్‌మోహ‌న్ రావు తెలిపారు. వర్ధమాన క్రికెట‌ర్ల నైపుణ్యాల‌ను గుర్తించేందుకు గ‌త‌నెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న హెచ్‌సీఏ అండర్-16 ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 177 జట్లు పాల్గొన్నాయి. గురువారం కీసరలోని స్టంప్స్ క్రికెట్ మైదానంలో జ‌రిగిన ఫైన‌ల్లో గౌతమ్ జూనియర్ కాలేజ్ (జీడిమెట్ల) 62 పరుగుల తేడాతో గెలిచింది. విజేత, రన్నరప్ జట్లకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు, భారత జట్టు మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్, హెచ్‌సీఏ కార్యద‌ర్శి దేవ్‌రాజ్, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్ క‌లిసి ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ.. త‌మ అపెక్స్ కౌన్సిల్ బాధ్యత‌లు చేప‌ట్టాక మార్పు మొద‌లైంద‌ని చెప్పారు. గ‌తంలో ప్లేట్ గ్రూప్‌లోని హైద‌రాబాద్ రంజీ జ‌ట్టు తిరిగి ఎలైట్ విభాగంలోకి వ‌చ్చింద‌ని, తాజాగా ఏడేళ్ల త‌ర్వాత హైద‌రాబాద్ టీమ్‌ ఆలిండియా బుచ్చిబాబు ట్రోఫీ గెలిచింద‌ని చెప్పారు. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌మ్మర్ క్యాంప్‌లు నిర్వహించామ‌ని అన్నారు. అలాగే ఇంట‌ర్ డిస్ట్రిక్ క్రికెట్ టోర్నమెంట్‌, ఉమెన్ లీగ్‌, ఇప్పుడు స్కూల్ లీగ్ నిర్వహించామ‌ని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో చ‌ర్చించి భ‌విష్యత్‌లో మ‌రిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్లడించారు. అనంత‌రం కార్యద‌ర్శి దేవ్‌రాజ్ మాట్లాడుతూ త‌మ కార్యవ‌ర్గం హెచ్‌సీఏలో సంస్కర‌ణ‌లకు శ్రీకారం చుట్టింద‌ని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed