నేతన్నలకు అండగా ఉంటాం

by Sridhar Babu |
నేతన్నలకు అండగా ఉంటాం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పదేళ్లలో ఏమీ చేయలేక 10 నెల కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రతి నేతన్నకు అండగా నిలబడతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్​ వద్ద కాంగ్రెస్ నేతలు గజమాలతో వారికి ఘన స్వాగతం పలికారు. నేతన్న విగ్రహం నుండి అంబేద్కర్ గాంధీ చౌక్​ల మీదుగా లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

అనంతరం రాష్ట్ర గ్రంథాలయ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రియాజ్, చైర్మన్ నాగుల సత్యనారాయణ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ 1978 నుండి నాగుల సత్యనారాయణ కుటుంబం కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిందని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నాగుల సత్యనారాయణ ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని పట్టుకుని శ్రమించారని, ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇచ్చిన లైబ్రరీ చైర్మన్ తో పాటు భవిష్యత్తులో రాష్ట్రస్థాయి పదవులు సత్యనారాయణకు వస్తాయని అన్నారు. సిరిసిల్ల గ్రంథాలయంలో సకల వసతులు కల్పించి రానున్న పోటీ పరీక్షల్లో అత్యధిక ఉద్యోగాలు సాధించి మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని, అలాగే ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తుందన్నారు.

అధికారుల మీద దాడులు చేస్తే అరెస్టులే

గత ప్రభుత్వం కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా ఇవ్వలేదని, సెక్షన్ల పేరుతో ప్రశ్నించే గొంతుకలను నొక్కివేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరసనలు చేసుకునే స్వేచ్ఛ కలిగించిందని, కానీ పరిధి దాటి దాడులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. అధికారుల మీద దాడులు చేస్తే అరెస్టులు చేయకుండా ఏం చేయాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.

ప్రతి ఒక్కరినీ పదవులు వరిస్తాయి

గత పదేళ్లు బీఆర్​ఎస్​ పాలకులు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడకుండా పార్టీ జెండాను మోసిన అందరికీ అభినందనలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పదవులు వరిస్తాయని, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో చాలా కష్టపడ్డా మంచి ఫలితాలు రాలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.

ఆత్మహత్యలు మానండి

సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు సరికాదని, దయచేసి నేతన్నలు ఆత్మహత్యలు మానుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఆత్మహత్యలకు మాత్రం పాల్పడవద్దని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించిందని, సిరిసిల్లకు యారన్ డిపోను కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇకమీదట తనతో పాటు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రజా ప్రతినిధులందరూ నెలలో రెండు రోజులు సిరిసిల్లలోని గడపనున్నట్లు స్పష్టం చేశారు.

ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సిరిసిల్లలో ఉందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. యారన్ డిపో శంకుస్థాపనతో పాటు నేత కార్మికులకు, పొదుపు సంఘం మహిళలకు ఇచ్చే చీరల ఆర్డర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. అనంతరం సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పార్లమెంటు నియోజకవర్గం ఇన్​చార్జీ వెలిశాల రాజేందర్రావు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్​చార్జీ కేకే మహేందర్ రెడ్డి, సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed