Heavy Rains:రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక..పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-23 02:36:56.0  )
Heavy Rains:రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక..పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని వానలు ముంచేత్తుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. మరో ఐదు రోజుల పాటు వర్షం కురుస్తుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిధిలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీంతో వాయుగుండం నేడు తెల్లవారుజామున పూరీ, చిలుకా లేక మధ్య ఉన్న తీరాన్ని దాటిందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల పై పడి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడక్కడ పిడుగు పడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed