అడ్డగోలుగా వన్యప్రాణుల వేట

by Mahesh |
అడ్డగోలుగా వన్యప్రాణుల వేట
X

దిశ, ములుగు ప్రతినిధి : అటవీ జంతువుల ప్రాణాలతో ఆటలాడుతూ వాటి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. వన్య ప్రాణులకు శాపంగా మారిన వేటగాళ్లు విచక్షణ రహితంగా అడవి జంతువులను వేటాడుతున్నారు. వాటిని వధించి మాంసాన్ని విక్రయిస్తూ అడవి జంతువుల పాలిట సంకటంగా మారుతున్నారు. ములుగు జిల్లా భౌగోళిక స్వరూపం లో అడవుల విస్తీర్ణం 70 శాతం ఉండగా అడవిలో జీవవైవిధ్యం తొణికిసలాడుతోంది. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ములుగు జిల్లాలో అడవి జంతువులను వేటాడే వేటగాళ్లు మాంసం కోసం జంతువులను విచక్షణారహితంగా వేటాడుతున్నారు. వాటిని చంపి మాంసం విక్రయాలు జరుపుతుండగా ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ఈ ఘటనలే అటవీ జంతువుల వేటకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా ఆశాఖ అధికారులు వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

మాంసం కోసం అడ్డగోలుగా వేట..

ములుగు జిల్లాలో తాడువాయి, పస్రా, ఏటూరునాగారం, మండపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అడవి జంతువుల ఉనికి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదే అదునుగా చూసుకొని వేటగాళ్లు అడవి జంతువుల ఉనికి ఎక్కువగా ఉండే ప్రదేశాలు, అడవిలో నీటి లభ్యత ఉన్నచోట, అడవి జంతువుల మార్గాలను పసిగట్టి ఉచ్చులు ఏర్పాటు చేయడం, అడవిలో కరెంటును ఆసరాగా చేసుకుని ఇనుప తీగలతో కరెంట్ ఉచ్చులను బిగించడం వంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. అందులో చిక్కిన అడవి జంతువులను చంపి మాంసాన్ని గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తూ వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. అడవికి చుట్టుపక్కల ఉన్న రైతులు పంట పొలాల్లోకి వన్య ప్రాణులు ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తున్నాయని, పంటలను కాపాడుకునే క్రమంలో చుట్టూ తీగలను అమర్చి కరెంటు బిగించడం వల్ల మరికొన్ని అటవీ జీవాలు మృత్యువాత పడుతున్నాయి.

రక్షణ చర్యలు అవసరం..

అడవిలో ఉండే వన్యప్రాణులకు రానురాను మనుషుల నుంచి రక్షణ లేకుండా పోవడంతో అడవుల్లో వన్యప్రాణుల కోసం రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. ములుగు జిల్లాలోని అడవి ప్రాంతంలో ఎక్కువగా వేటగాళ్ల చేతిలో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అడవులలో అక్కడక్కడ కెమెరా ట్రాప్పులు, రాత్రిపూట ఫారెస్ట్ అధికారుల గస్తీ వంటి భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల కొంతమేర అడవిలో వేట తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అడవి జంతువులను హతమార్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల మిగతావారు అడవిలోకి వెళ్లేందుకు భయపడతారనే వాదన సైతం జిల్లా ప్రజల నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా అడవిలోని వన్యప్రాణులను కాపాడుకోవడం మన బాధ్యతగా భావించి అటవీ జంతువులు అంతరించిపోకుండా కాపాడుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed