అక్రమ నిర్మాణాల‌పై కొర‌డా..! యజమానులకు జీడ‌బ్ల్యూఎంసీ నోటీసులు

by Shiva |
అక్రమ నిర్మాణాల‌పై కొర‌డా..! యజమానులకు జీడ‌బ్ల్యూఎంసీ నోటీసులు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో అక్రమ నిర్మాణపై జీడబ్ల్యూఎంసీ సైరన్ మోగించింది. వ‌రంగ‌ల్‌లోని భ‌ద్రకాళి, చిన్నవ‌డ్డెప‌ల్లి, కోట చెరువు కాజీపేట‌లోని బంధం చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్ల ప‌రిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాల‌పై జీడ‌బ్ల్యూఎంసీ కొర‌డా ఝుళిపిస్తోంది. ఈ నాలుగు చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్లలో ఎలాంటి అనుమ‌తులు లేకుండా ఆక్రమ‌ణ‌ల‌తో అక్రమంగా నిర్మాణాలు జ‌రిగాయ‌ని గుర్తించిన 700 మందికి తాజాగా నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. మీరు చెరువు ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల ప‌రిధిలో నిర్మాణం చేప‌ట్టారు. స్థలం మీదేన‌ని రుజువు చేసుకునే ద‌స్తావేజులు, ఇంటి నిర్మాణానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి తీసుకున్న అనుమ‌తి ప‌త్రాలు చూపాల‌ని నోటీసుల్లో పేర్కొంది.

త‌క్కువ‌కే వ‌స్తున్నాయ‌ని కొనుగోళ్లు..

వాస్తవానికి ఫుల్ ట్యాంక్ లెవ‌ల్ ప‌రిధిలోని భూముల‌కు త‌ప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించిన కొంత‌మంది రియ‌ల్టర్లు పేద ప్రజ‌ల‌కు అగ్గువ స‌గ్గువ‌కు అంట‌గ‌ట్టారు. భూములు త‌క్కువ‌కే వ‌స్తున్నాయ‌ని కొనుగోళ్లు చేప‌ట్టిన వారు జీడ‌బ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండానే నిర్మాణాలు చేప‌ట్టడం గ‌మ‌నార్హం. 1995 నుంచి ఈ నాలుగు చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్లలో ఆక్రమ‌ణ‌లు పెరుగుతూ వ‌చ్చాయి. ఎప్పటిక‌ప్పుడు ఆక్రమ‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగింది. అరిక‌ట్టాల్సిన అధికారులు రాజ‌కీయ ఒత్తిళ్లతో, త‌మ‌కెందుకులేన‌నుకుని త‌మ వంతుగా అక్రమాల‌కు పాల్పడ‌టంతో భూ దందా పెరుగుతూ పోయింది. రాజ‌కీయ ఒత్తిళ్లు, ఇరిగేష‌న్‌, రెవెన్యూ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం వంటి కారణాలున్నాయి. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల‌తో పాటు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని నిర్మాణాల‌పై ప్రభుత్వం సీరియ‌స్‌గా ఉండ‌టంతో బ‌ల్దియా టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు చ‌ర్య‌లకు దిగారు. అక్రమ నిర్మాణాల‌పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. భ‌ద్రకాళి చెరువు ప‌రిధిలోని నిర్మాణాల‌పై శ‌నివారం ఉద‌యం కూల్చివేత‌లు ఇందుకు ప్రారంభంగా చెప్పవ‌చ్చు.

2010లో హైకోర్టులో ఫిర్యాదు.. ఇప్పుడు క‌ద‌లిక‌..

భ‌ద్రకాళి, చిన్నవ‌డ్డెప‌ల్లి, కోట చెరువు కాజీపేట‌లోని బంధం చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌ జోన్ల ప‌రిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాల‌పై చ‌ర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ ఇంటాక్ కన్వీనర్, కాజీపేట ఎన్ఐటీ రిటైర్డ్ ప్రొఫెస‌ర్ పాండురంగారావు 2010లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంవ‌త్సరం జూన్‌లో తుది తీర్పు వెల్ల‌డిస్తూ అక్రమ నిర్మాణాల‌ను తొల‌గించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తాజాగా ప్రభుత్వం మార్గద‌ర్శకాల‌తో నాలుగు చెరువుల ప‌రిధిలోని అక్రమ నిర్మాణాల‌ను తొల‌గించేందుకు బ‌ల్దియా టౌన్ ప్లానింగ్ విభాగం సిద్ధమైంది. అందులో భాగంగానే నాలుగు చెరువుల్లో అక్రమ నిర్మాణంగా గుర్తించిన 700 మందికి నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయ రంగు

అక్రమ నిర్మాణాల‌పై బ‌ల్దియా టౌన్ ప్లానింగ్ కూల్చివేత‌ల‌కు సిద్ధమ‌వుతుండ‌టంతో విష‌యం రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో పేద‌లు నిర్మించుకున్న ఇళ్లపై గ‌త ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవ‌హ‌రించ‌గా, నేటి ప్రభుత్వం క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శలు సంబంధిత బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. రాజ‌కీయ ల‌బ్ధి, రాజకీయ న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్‌, ప్రతిప‌క్ష బీఆర్ ఎస్ పార్టీల నాయ‌కులు వాగ్యుద్ధానికి దిగుతుండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story