అక్రమార్కుల చెరలో ఊరకుంట చెరువు ..! బీటీ, సీసీ రోడ్ల ఏర్పాటు

by Shiva |
అక్రమార్కుల చెరలో ఊరకుంట చెరువు ..! బీటీ, సీసీ రోడ్ల ఏర్పాటు
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధిలోఊరకుంట చెరువు కబ్జాకు గురైంది. సర్వే నెం.62లో ఉన్న సుమారుగా 8 ఎకరాల్లో కుంట ఉండగా.. శిఖం భూమి సుమారుగా 2 ఎకరాలు, కట్ట విస్తీర్ణం ఎకరం భూమి కబ్జాకు గరైంది. శిఖం భూమి ఆక్రమించి రియల్టర్లు ప్లాట్లు చేసి విక్రయించారు. చెరువులో గృహ, కమర్షియల్ బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోయినా ఇంటి నెంబర్లు, విద్యుత్ కనెక్షన్లు, మిషన్ భగీరథ పైపు‌లైన్ అనధికార అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం.

గజం రూ.40 వేలకు పైగానే..

ఊరకుంట చెరువు ఇల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారి నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ఆక్రమణదారులు కట్టను కబ్జా చేశారు. చెరువు కట్టపై బహుళ అంతస్తులు యథేచ్ఛగా వెలిశాయి. ఈ ప్రదేశంలో వ్యాపార భవనాలు, వార సంత నడవడంతో వ్యాపార సముదాయాలుగా మారి భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రాంతంలో గజం భూమి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పైగానే పలుకుతున్నట్లు సమాచారం. గార్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరించడంతో చెరువు భూమిలోకి రోడ్డు విస్తరించింది. కొంతమంది ఆక్రమణదారులు శిఖం భూమిని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో రోడ్డు ఎస్సీ కాలనీని ఆనుకుని ఉండడంతో చెరువు ఎఫ్టీఎల్‌లో మట్టి నింపి ప్లాట్లు చేసేందుకు సిద్ధం చేశారు. చెరువులో మరికొంత ప్రాంతం ప్లాట్ చేసి విక్రయాలు చేపట్టారు. చెరువు ఆయకట్టు కింద సుమారుగా 30 ఎకరాలకు సాగునీరు అందించేది. నేడు ఆక్రమణదారుల చెరలో కొట్టుమిట్టాడుతోంది. ఇంత జరుగుతున్నా.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై రైతులు, గ్రామ ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చెరువును కబ్జా చేశారు..

నేను సర్పంచ్‌గా ఎన్నిక కాకముందు ఊర చెరువు కట్ట, ఎఫ్టీఎల్, శిఖం భూమి చాలా వరకు కబ్జా చేశారు. ఆ విషయంపై అనేక సార్లు జిల్లా ఇరిగేషన్ అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోకపోవడంతో చెరువు మరింత ఆక్రమణకు గురైంది. భూములకు విపరీతంగా రేట్లు పలకడంతో ఈ భూములపై కన్ను పడి కబ్జా చేశారు. ఇప్పటికైనా అధికారులు చెరువుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. - ఇర్ప మమత, కొత్తపేట మాజీ సర్పంచ్.

ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు..

చెరువు కింద నాకు మూడు ఎకరాల సాగు భూమి ఉంది. చెరువు తూములను కబ్జాదారులు మూసి వేయడంతో మా పొలాలకు నీరు రావడం లేదు. చెరువు నీటితో గతంలో సుమారుగా 15 మంది రైతులకు చెందిన 30 ఎకరాలు గతంలో సాగునీరు అందేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అధికారులు పట్టించుకొని తూములకు మరమ్మతులు చేసి చెరువును కబ్జాదారుల నుంచి రక్షించాలి.- రాయల రాజేష్, ఆయకట్టు సాగు రైతు.

నోటీసులు ఇచ్చాం..

చెరువు కట్టపై బహుళ అంతస్తు నిర్మాణాలపై గతేడాది కొంతమంది ఇంటి యజమానులకు గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు ఇచ్చాం. గ్రామ పంచాయతీ‌లో ఏజెన్సీ చట్టం అమలులో ఉన్నందున గిరిజనేతరుల ఇంటి నిర్మాణాలకు అధికారికంగా అనుమతులు లేవు. ఇచ్చిన అనుమతులు తాత్కాలికమే. - ఎండీ అలీ, కొత్తపేట, పంచాయతీ కార్యదర్శి

మరమ్మతులకు నిధులు రాలేదు..

కొత్తపేటలో ఊరకుంట చెరువు కింద 30 ఎకరాలకు సాగు నీరు చేరుతుంది. మండలంలో చెరువుల మెయింటెనెన్సు‌కు ఎలాంటి నిధులు రావడం లేదు. ఆయకట్టు రైతులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మా శాఖ నుంచి ఎలాంటి చర్యలు తీసుకలేకపోతున్నాం. - శ్రీకాంత్, ఏఈ, ఇరిగేషన్.

నోటీసులు జారీ చేస్తాం..

ఊరకుంట చెరువు కబ్జా విషయం నాకు తెలియదు. ఇటీవలే బదిలీ‌పై బయ్యారం వచ్చాను. పూర్తి వివరాలు సేకరించి చెరువును పరిశీలిస్తాం. కబ్జాకు గురైతే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. -విజయ, తహశీల్దార్

Next Story

Most Viewed