సరదా...దసరా.. పలు చోట్ల రావణ వధ

by Sumithra |
సరదా...దసరా.. పలు చోట్ల రావణ వధ
X

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలంలో చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం మండలం వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు దసరా పర్వదినాన్ని ఉత్సాహ పూరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. వివిధ కుల వృత్తుల వారు, పోలీసులు శాస్త్ర యుక్తంగా ఆయుధ పూజ నిర్వహించారు. సాయంత్రం చెరువు గట్లు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే వివిధ ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును ఏర్పాటు చేసి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిత్రులు, శ్రేయోభిలాషులకు జమ్మి ఆకు పంచుకొని ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తల్లిదండ్రులకు జమ్మి ఆకు సమర్పించి ఆశీర్వాదం అందుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో రావణ వధ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

పోలీస్‌ స్టేషన్‌లలో ఆయుధ పూజ..

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేసముద్రం పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆయుధాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు మురళీధర్ రాజ్, రాజయ్య, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed