లేబర్ కార్యాలయంలో ఉద్యోగులేరి..?

by Aamani |
లేబర్ కార్యాలయంలో ఉద్యోగులేరి..?
X

దిశ, వెబ్ డెస్క్: లేబర్ కార్యాలయ ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉండటం లేదు. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాల నుంచి క్లెయిమ్స్ కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ముగ్గురు ఉద్యోగులు ఉండగా, ఏ ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉంటున్న పరిస్థితి లేదు. నర్సంపేటలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా విధులు నిర్వహించే మహమ్మద్ అలీ నెల కిందట మెడికల్ లీవ్ పై వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ పనిచేసే అటెండర్ బదిలీపై వెళ్లారు. ఈ క్రమంలో సత్తుపల్లి కి చెందిన ఏఎల్ఓ వెంగమాంబను ఇక్కడికి డిప్యూటేషన్ పై పంపించారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు పని చేయాల్సి ఉంది. అయినప్పటికీ నేటికీ కార్యాలయానికి వచ్చే వారికి సరైన సమాధానం దొరకట్లేదు. డిప్యూటేషన్ పై ఏఎల్ఓ చేరి నెల గడుస్తున్నా నేటికీ విధుల్లో పూర్తి స్థాయిలో రావట్లేదు. వారానికి ఒక రోజు మాత్రమే కార్యాలయానికి వస్తున్నట్లు తెలుస్తుంది.

వివాహం, డెలివరీ, అకాల, ప్రమాదవశాత్తు మరణాలకు సంబంధించి క్లెయిమ్స్ కోసం నర్సంపేటలోని అసిస్టెంట్ లేబర్ కార్యాలయానికి నియోజకవర్గ వ్యాప్తంగా జనాలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల గైర్హాజరు, వారానికి ఒక రోజే అధికారి వస్తుండటంతో అర్హులైన వారు పలుమార్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై వివరణ కోరగా.. సత్తుపల్లి, ఖమ్మం సహా నర్సంపేట లోనూ అదనపు బాధ్యతలు అప్పజెప్పినట్లు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అటెండర్ బదిలీ కావడంతో జూనియర్ అసిస్టెంట్ ఒకరే పూర్తి స్థాయిలో విధుల్లో ఉంటున్న పరిస్థితి నెలకొంది.

కొన్ని రోజులుగా ఇతని అనారోగ్యం కారణంగా తన కుమారుడిని విధులకు పంపిస్తున్నట్లు, ఈ విషయంపై నూతన ఏఎల్ఓ కి సమాచారం అందించినట్లు తెలపడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో పని చేసే వ్యక్తికి కార్యాలయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియక పోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సేవలు అందించాల్సిన ఏఎల్ఓ కార్యాలయానికి రోజుకు కనీసం ఐదు నుండి పది క్లెయిమ్స్ వస్తుంటాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నర్సంపేట ఏఎల్ఓ కార్యాలయంలో కనీసం వారంలో మూడు, నాలుగు రోజులు అయినా ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed