- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ ఉద్యోగుల వెనుక ఉన్నదెవరు?
అవినీతి ఆరోపణలతో పీకల్లోతు లో కూరుకుపోయిన గ్రేటర్వరంగల్ మున్సిపల్కార్పొరేషన్లో మరో బాగోతం వెలుగుచూసింది. ఉద్యోగుల్లో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఓ ఉద్యోగికి బదులు అతని భార్య కాజీపేట జోనల్పరిధిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కరే కాకుండా బల్దియా పరిధిలో చాలా మంది ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కార్పొరేటర్లు వారి కుటుంబ సభ్యులు, బంధువులు సైతం వేరొకరితో ఉద్యోగం చేయిస్తూ నెలనెలా రూ.వేలల్లో జీతాలు తీసుకుంటున్నట్లు పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
అసలు నకిలీ ఉద్యోగుల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు ? వారికి అండగా నిలుస్తున్నదెవరు? అసలు ఏఏ విభాగాల్లో ఇలా ఉద్యోగులు పనిచేస్తున్నారు? వీరిని ఎవరు నియమించారు? నిత్యం విధులు నిర్వహించే వారిని ఉన్నతాధికారులు గుర్తించడం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే అధికారులు కాజీపేట జోనల్ పరిధితోపాటు కాశీబుగ్గ, ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల హాజరు నమోదు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ ఉద్యోగులు తమ విషయం బయటకు పొక్కకుండా పైరవీలు మొదలు పెట్టినట్లు బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దిశ, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒకరికి బదులు మరొకరు ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఉద్యోగికి బదులు అతని భార్య కాజీపేట జోనల్ పరిధిలో పనిచేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె ఒక్కరే కాకుండా మరికొందరు కూడా వరంగల్ మహా నగర పాలక సంస్థలో పని చేస్తున్నట్లు బల్దియాలో బాహాటంగానే చర్చ జరుగుతోంది. అంతేకాదు, కొంతమంది కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు, వారి బంధువులు కూడా ఉద్యోగాలు పొంది వారి తరపున మరొకరితో పని చేయిస్తూ నెలనెలా వేతనాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే, అసలు జీడబ్ల్యూఎంసీలో అలాంటి వారు ఎవరు ఉన్నారు? ఉంటే ఎంతమంది ఉన్నారు? ఏఏ విభాగంలో పని చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వారు ఉంటే ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? వారిని ఎవరు, ఎలా నియమించారు? అసలు అలాంటి వారికి అండగా నిలిచేది ఎవరు? అనే సందేహాలు ఇతర ఉద్యోగుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతాధికారులు, పాలకవర్గంలో బడా నేతల హస్తం లేనిదే నకిలీ ఉద్యోగులు చలామణి అవడం కష్టమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
విచారణ సాగేనా?
అయితే, నకిలీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో అసలు ఉద్యోగులు చాలామంది శానిటేషన్ విభాగంలో నియమితులైనట్లు తెలుస్తోంది. వీరు చేసేది చెత్త ఏరివేత పని కావడంతో వారిపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదని, ఈ క్రమంలోనే ఇతరులతో పని చేయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై వరంగల్ మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విచారణ చేపట్టినా పారదర్శకంగా చేపడతారా లేదా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. నకిలీలపై ఇప్పటికే ఉన్నతాధికారి ఒకరు సమాచారం సేకరిస్తున్నట్లు బల్దియాలో ప్రచారం జరుగుతోంది. కాజీపేట జోనల్ పరిధితోపాటు కాశీబుగ్గ, ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల హాజరు నమోదు రికార్డులను పరిశీలిస్తున్నట్లు చర్చ జరిగితోంది.
ఇదిలా ఉండగా, సదరు నకిలీ ఉద్యోగులు తమ అనుంగు నేతలు, అధికారులతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పైరవీలు మొదలు పెట్టినట్లు బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చర్యలు తీసుకోవల్సి వచ్చినా తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు రాయబారాలు నడుపుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. కాజీపేట జోనల్ అధికారులు ఇందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో 452 మంది ఉద్యోగుల నియామకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటికి అసలు విషయం మాత్రం బయటకు పొక్కలేదు. దీని వెనుక బడా నేతలు, అధికారులు చక్రం తిప్పినట్లు విమర్శలు ఉన్నాయి. అయితే అదే తరహాలో ఈ నకిలీ ఉద్యోగుల వ్యవహారం కూడా లోలోపలే సర్దుబాటు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం గుట్టురట్టు అవుతుందో లేదా గుట్టుగానే మిగిలి పోతుందో వేచి చూడాల్సిందే.