డీసీసీల‌పై స‌స్పెన్స్‌... వారంలోపు క్లారిటీ వ‌చ్చే ఛాన్స్‌..!

by S Gopi |
డీసీసీల‌పై స‌స్పెన్స్‌... వారంలోపు క్లారిటీ వ‌చ్చే ఛాన్స్‌..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామ‌కంలో పాత‌వారికే కొత్తగా ప‌గ్గాలు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. హ‌న్మకొండ జిల్లాకు నాయిని రాజేంద‌ర్‌రెడ్డిని, మ‌హ‌బూబాబాద్‌కు జెన్నారెడ్డి భ‌ర‌త్‌చంద‌ర్‌రెడ్డిని, ములుగు జిల్లాకు న‌ల్లెల కుమార‌స్వామిని మ‌రోమారు నియ‌మిస్తూ కాంగ్రెస్ జాతీయ‌ కార్యద‌ర్శి కేసీ వేణుగోపాల్ శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఇప్పటివ‌ర‌కు వ‌రంగ‌ల్, హ‌న్మకొండ జిల్లాల‌కు అధ్యక్షుడిగా ఉండ‌గా, తాజాగా హ‌న్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియామ‌కం చేసింది. డీసీసీ అధ్యక్షుల నియామ‌కాల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మార్క్ స్పష్టంగా క‌నిపిస్తోంది. వాస్తవానికి డీసీసీ అధ్యక్షుల నియామ‌కాల్లో నూత‌న‌ పాతవారికే అవ‌కాశం ఉంటుంద‌ని ప్రచారం జ‌రిగినా.. సీనియారిటీ, పార్టీలో ప‌నిచేసిన అనుభ‌వం, రాజ‌కీయ స‌మ‌ర్థత వంటి అంశాల‌ను బేరీజు వేసుకుని మూడు జిల్లాల విష‌యంలో పాత‌వారిపైపే మొగ్గు చూపిన‌ట్లుగా తెలుస్తోంది.

మూడు జిల్లాల అధ్యక్షుల నియామ‌కంపై స‌స్పెన్స్‌..!

వ‌రంగ‌ల్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జ‌న‌గామ జిల్లాల‌కు అధ్యక్షుల నియామకంపై పార్టీ అధిష్ఠానం స‌స్పెన్స్ కొన‌సాగిస్తోంది. ప్రస్తుతం జ‌న‌గామ అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘ‌వ‌రెడ్డితోపాటు కొమ్మూరిప్రతాప్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వ‌రంగ‌ల్ విష‌యంలో మాజీ ఎమ్మెల్సీ, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ కొండా ముర‌ళీ, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప‌నిచేసిన‌ దొంతి మాధ‌వ‌రెడ్డిలకు తాము సూచించిన నేత‌ల‌కు డీసీసీ అధ్యక్ష ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అధిష్ఠానం దీనిపై ఎటు తేల్చుకోలేక మ‌ద‌న‌ప‌డుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి అధ్యక్ష ప‌ద‌వికి ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌బాబు వ‌ర్గం నేత‌గా ఉన్న అయిత ప్రకాష్‌ను కొన‌సాగించాల‌నే డిమాండ్ వినిపిస్తుండ‌గా, గండ్ర స‌త్యనారాయ‌ణ‌కు లేదా ఆయ‌న సూచించిన వ్యక్తికి డీసీసీ ప‌గ్గాలు అప్పగించాల‌నే డిమాండ్ కూడా అధిష్ఠానానికి నేత‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఏ డిమాండ్ ఎలా ఉన్నా.. పార్టీలో నేత‌ల‌ను స‌మ‌న్వయంతో ముందుకు తీసుకెళ్లగ‌ల స‌మ‌ర్థత‌, కార్యనిర్వహ‌ణ సామ‌ర్థ్యం గ‌ల నేత‌ల‌కే అవ‌కాశం ఉంటుంద‌ని టీపీసీసీలోని ఓ కీల‌క నేత దిశ‌కు వెల్లడించారు. వారం రోజుల్లోపే జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, జ‌న‌గామ జిల్లాల అధ్యక్షుల నియామ‌కాలు కూడా పూర్తవుతాయ‌ని స‌మాచారం.

సీనియారిటీకే ప్రాధాన్యం..!

హ‌న్మకొండ డీసీసీ అధ్యక్ష ప‌ద‌వికి ప‌లువురు నేత‌లు పోటీప‌డినా నాయిని రాజేంద‌ర్‌రెడ్డి క‌ష్టకాలంలో పార్టీని న‌డిపించాడ‌నే భావ‌న‌తో రేవంత్‌రెడ్డి మ‌రో ఆలోచ‌న చేయ‌లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మ‌హ‌బూబాబాద్‌లో రేవంత్‌రెడ్డికి బంధువైన శ్రీకాంత్‌రెడ్డికి ఈసారి డీసీసీ అధ్యక్ష బాధ్యత‌లు ద‌క్కుతాయ‌ని ప్రచారం జ‌రిగింది. అయితే సుదీర్ఘకాలంగా పార్టీలో కొన‌సాగుతున్న భ‌ర‌త్‌చంద‌ర్‌రెడ్డికి సీనియ‌ర్ల సపోర్ట్ ఎక్కువ‌గా ఉండ‌డం, శ్రీకాంత్‌రెడ్డి కూడా కొంత స‌ర్దుబాటుకు స‌రేన‌న‌డంతో డీసీసీ అధ్యక్ష నియామ‌కంలో అసంతృప్తికి తావు తేకుండాపోయింద‌న్న అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ఎమ్మెల్యే, జాతీయ కాంగ్రెస్ మ‌హిళా ప్రధాన కార్యద‌ర్శి సీత‌క్క సూచ‌న మేర‌కు ములుగు జిల్లా అధ్యక్షుడిగా న‌ల్లెల కుమార‌స్వామిని మ‌రోమారు కొన‌సాగించేందుకు స‌రేనన్నట్లుగా స‌మాచారం.

ఇక‌పై దూకుడే: నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, హ‌న్మకొండ డీసీసీ అధ్యక్షుడు

పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాను. సీనియారిటీ, అంకిత‌భావం, స‌మ‌ర్థత‌ల‌ను గుర్తించే హ‌న్మకొండ జిల్లా పార్టీ ప‌గ్గాలు నాకు అప్పగించిన‌ట్లుగా భావిస్తున్నా. ఇక‌పై పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచుతాం. ప్రజ‌ల్లోకి వెళ్లేందుకు, ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటం చేసేందుకు విస్తృతంగా ప‌నిచేస్తాం. పార్టీలో ఎలాంటి విబేధాలు, బేషజాలు లేకుండా ప్రతీ నాయ‌కుడిని, కార్యక‌ర్తను క‌లుపుకుని ముందుకెళ్తాం. జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే మా అంతిమ ల‌క్ష్యం. ఖ‌చ్చితంగా అందులో స‌ఫ‌లీకృత‌మ‌వుతాం. ఆ న‌మ్మకం ఉంది.

స‌మ‌న్వయంతో ప‌నిచేస్తాం: భ‌ర‌త్‌చంద‌ర్‌రెడ్డి, మ‌హ‌బూబాబాద్ డీసీసీ అధ్యక్షుడు

జిల్లాల్లో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం తీసుకొస్తాం. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు చేస్తాం. పార్టీ మ‌రోమారు నాపై పెట్టిన న‌మ్మకాన్ని వ‌మ్ము చేయ‌ను. అంద‌రి నేత‌ల‌ను క‌లుపుకుని వెళ్తాం. పార్టీ కోసం ప‌నిచేసేందుకు ప్రణాళిక‌లు రూపొందించుకుంటాం.

Advertisement

Next Story