ఇసుక‌ కేడీల‌కు బేడీలు ప‌డేనా..?

by S Gopi |
ఇసుక‌ కేడీల‌కు బేడీలు ప‌డేనా..?
X

న‌కిలీ వేబిల్లులు సృష్టించి కోట్ల రూపాయ‌ల ఇసుక దందా సాగిస్తున్న ముఠాల‌పై ఖాకీలు క‌రుణ చూపుతున్నారా..? త‌నిఖీల్లో ప‌ట్టుకున్నట్లు ప్రక‌టించి ఆ త‌ర్వాత విచార‌ణ పేరుతో జాప్యం చేస్తూ శిక్షల నుంచి నిందితుల‌ను త‌ప్పించేస్తున్నారా..? గ‌తంలోనూ అదే జ‌రిగిందా..? ఇటీవ‌ల వాహ‌నాల త‌నిఖీల్లోనూ అదే జ‌రగ‌బోతోందా..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది డిపార్ట్‌మెంట్ వ‌ర్గాల నుంచి. గోదావ‌రి ఇసుక‌కు హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ప‌ట్టణాల్లో విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. దీంతో ఇసుక మాఫియా అడ్డదారుల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ వే బిల్లులతో దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీ నిర్వాహకులు, టీఎస్​ఎండీసీ అధికారులు, లారీల యజమానులు, వ్యాపారులు ఒక్కటే ఇసుక దందాకు తెరలేపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: గోదావ‌రి ఇసుక అంటేనే నాణ్యమైన‌దని నిర్మాణ‌దారుల‌కు విశ్వాసం. దీంతో ఇసుకకు మార్కెట్​లో భలే డిమాండ్​ఏర్పడింది. ఇదే అదనుగా ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రూ. కోట్లలో ప్రభుత్వ ఖాజానాకు గండికొడుతూ సొంత జేబులు నింపుకుంటున్నారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని మ‌హ‌దేవ్‌పూర్‌, ప‌లిమెల మండ‌లాల్లో సుమారు 8 క్వారీల నుంచి, ములుగు జిల్లా ఏటూరునాగారం, వాజేడు, వెంక‌టాపురం, మంగ‌పేట‌, క‌న్నాయిగూడెం మండ‌లాల్లోని ప్రస్తుతం 12 క్వారీల నుంచి, పొరుగు జిల్లా భ‌ద్రాద్రి కొత్తగూడెంలోని మ‌ణుగూరు ప్రాంతాల క్వారీల నుంచి జిల్లా మీదుగా లారీల్లో ఇసుక ర‌వాణా జ‌రుగుతోంది.

న‌కిలీ బిల్లుల‌తో దందా ఇలా...

నిబంధనల ప్రకార‌మైతే రోజు వారీ ఇసుక వివరాలకు అనుగుణంగా టీఎస్‌ఎండీసీ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవాలి. వినియోగ‌దారులు బుకింగ్ డీడీని సదరు క్వారీల వద్ద ఉండే టీఎస్‌ఎండీసీ సిబ్బంది, క్వారీ నిర్వాహకులు చెక్‌ చేసి వాహ‌న‌దారుల‌ను లోడింగ్‌కు అనుమతించాలి. అయితే క్వారీల వద్ద ఇలాంటి నిబంధనలు కానరావడం లేదు. టీఎస్ ఎండీఎస్ వే బిల్లుల‌ను ఫొటో షాప్‌లో ఎడిట్ చేసి లారీ నెంబ‌ర్‌, లారీలో ఇసుక లోడింగ్ వివ‌రాల‌ను మార్చేసుకుంటున్నారు. పోలీసులు త‌నిఖీలు చేసిన స‌మ‌యంలో ఈ బిల్లుల‌నే చూపుతూ మ‌స్కా కొడుతున్నారు. క్వారీ ఓన‌ర్లు చెప్పిన చోట‌కు తీసుకెళ్లి ఇసుక‌ను డంప్ చేసి డ‌బ్బు తీసుకుని వ‌స్తున్నారు. ఈ మొత్తం వ్యవ‌హారంలో ఇసుక క్వారీల య‌జ‌మానులు ప్రభుత్వానికి రావాల్సిన ప‌న్నుల‌ను ఎగ‌వేయ‌డ‌మే కాకుండా కోట్ల రూపాయ‌లను జేబుల్లోకి మ‌ళ్లించుకుంటున్నారు. క్వారీ డంపింగ్ యార్డుల వ‌ద్ద సీసీ కెమెరాల‌ను తొల‌గించి, టీఎస్ ఎండీసీ ప్రాజెక్టు ఆఫీస‌ర్‌, క్వారీ వ‌ద్ద ప‌ర్యవేక్షకుల సాయంతో క్వారీ ఓనర్లు, లారీల ఓన‌ర్లు ద‌ర్జాగా దందా సాగిస్తున్నారు. తిలా పాపం త‌లా పిడికెడు అన్నట్లుగా అక్రమ ర‌వాణా ద్వారా వ‌చ్చే సొమ్ములో త‌లా ఇంతా పంచుకుని జేబులో వేసుకుంటున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఇసుక ఆదాయాన్ని అప్పనంగా మొక్కేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

అక్రమ ర‌వాణాతో రెచ్చిపోతున్నారు...

క్వారీల ద్వారా పలువురు లారీల యజమానులు, వ్యాపారులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గతంలో అడపాదడపాగా కొనసాగిన ఈ దందా ప్రస్తుతం పెరిగిపోయింది. కొంత‌మంది వాహ‌న‌దారులు, టీఎస్ ఎండీసీ అధికారుల‌ను, సిబ్బందిని గుప్పిట ప‌ట్టుకుని ఈ దందా సాగిస్తున్నారు. క్వారీ ఓన‌ర్లకు లాభాలు కురుస్తున్నాయి. రోజూ ప‌దుల సంఖ్యలో వే బిల్లులు లేకుండా, నకిలీ నెంబర్ ప్లేట్లతో లారీల్లో ఇసుక హైద‌రాబాద్ స‌హా ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిపోతోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా వ‌రంగ‌ల్ న‌గ‌ర శివారులో లారీలు ప‌ట్టుబ‌డుతుండ‌డమే ఇందుకు నిద‌ర్శనం. జ‌న‌గామ‌, ర‌ఘునాథ‌ప‌ల్లి, ములుగు ప్రాంతాల్లో పోలీసుల త‌నిఖీల్లో లారీలు ప‌ట్టుబ‌డ్డాయి.

దొంగ‌ల‌కు శిక్షలేవీ..?

గ‌త ఏడాది అక్టోబ‌ర్ 28న జ‌న‌గామ జిల్లా ర‌ఘునాథ‌ప‌ల్లి మండ‌లం కోమ‌ల్ల గ్రామం వ‌ద్ద జాతీయ ర‌హ‌దారి 163పై పోలీసులు త‌నిఖీలు నిర్వహించి లారీల‌ను ప‌ట్టుకున్నారు. అలాగే 18 రోజుల క్రితం ములుగు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుక లారీల‌పై నిఘా వేసిన వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. వరంగల్ ఆరెప‌ల్లి ఓఆర్ఆర్ కు స‌మీపంలో, స్టేషన్‌ఘ‌న్‌పూర్ మండ‌ల‌ కేంద్ర శివారులో, రఘునాథపల్లి, జ‌న‌గామ ప్రాంతాల్లో పోలీసులు ఏక‌కాలంలో త‌నిఖీలు చేప‌ట్టడంతో సుమారు 46 లారీలను స్వాధీనం చేసుకున్నట్లు స‌మాచారం. న‌కిలీ వే బిల్లులు సృష్టించి ర‌వాణా చేస్తున్నట్లుగా నిర్ధారించుకున్నారు. వాహ‌నాల‌కు త‌ప్పుడు నెంబ‌ర్ ప్లేట్లను త‌గిలించి, ఫేక్ వే బిల్లుల‌తో ర‌వాణా చేస్తూ ప‌ట్టుబ‌డుతున్నా పెద్దగా నిందితుల‌పై చ‌ర్యలుండ‌టం లేద‌న్న విమ‌ర్శలున్నాయి. త‌రుచూ ఇసుక అక్రమ ర‌వాణాల‌కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు న‌మోదు చేయాల్సి ఉన్నా పోలీసులు క‌ఠినంగా వ్యవ‌హ‌రించ‌డంలేదు. దీంతో ప‌దేప‌దే ఇదే దందాను నిందితులు కంటిన్యూ చేస్తున్నారు. జ‌రిమానాలు విధిస్తే ష‌రామాములుగానే క‌ట్టేసి వాహ‌నాల‌ను విడిపించుకుని వెళ్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందాపై వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ దృష్టి సారిస్తే స‌త్ఫలితం ఉంటుంద‌ని వ‌రంగ‌ల్ ప్రజ‌లు కోరుతున్నారు.

Advertisement

Next Story