బండి అరెస్టుపై హైడ్రామా.. ప్రతి క్షణం పోలీసుల మాస్టర్ ప్లాన్

by Mahesh |   ( Updated:2023-04-06 02:56:20.0  )
బండి అరెస్టుపై హైడ్రామా.. ప్రతి క్షణం పోలీసుల మాస్టర్ ప్లాన్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ అరెస్టు నుంచి రిమాండ్ ప్రక్రియ వ‌ర‌కు పోలీసులు చాలా వ్యూహాత్మక‌మైన వైఖ‌రిని అవ‌ల‌భించిన‌ట్లు స్పష్టమ‌వుతున్నది. బండి సంజ‌య్ అరెస్టు.. త‌ర‌లింపులో పోలీసులు హైడ్రామాను కొన‌సాగించారు. కార‌ణాలేమైనా సంజ‌య్ అరెస్టు.. బొమ్మలరామారం పీఎస్‌కు త‌ర‌లింపు.. అక్కడి నుంచి హ‌న్మకొండ జిల్లా కోర్టు జ‌డ్జి ఎదుట ప్రవేశ పెట్టే క్రమంలోనే అనేక నాట‌కీయ ప‌రిణామాలు, వ్యూహాత్మక వైఖ‌రిని అవ‌లంభించిన‌ట్లుగా అవ‌గ‌త‌మ‌వుతోంది. టెన్త్ హిందీ ప‌రీక్ష ప‌శ్నప‌త్రం బ‌య‌ట‌కు రావ‌డంలో బండి సంజ‌య్యే కుట్రదారుడిగా పేర్కొంటూ మంగ‌ళ‌వారం అర్ధరాత్రి ఆయ‌న నివాసంలో పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

క‌రీంన‌గ‌ర్‌లో బండి సంజ‌య్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొద‌ట యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని బొమ్మల‌రామారం పీఎస్‌కు త‌ర‌లించారు. హ‌న్మకొండ జిల్లా సెష‌న్ కోర్టు జ‌డ్జి అనిత ఎదుట హాజ‌రు ప‌ర్చేందుకు బుధ‌వారం ఉద‌యం అక్కడ్నుంచి బందోబ‌స్తుతో బ‌య‌ల్దేరారు. జ‌న‌గామ ప‌ట్టణం మీదుగా పాల‌కుర్తికి త‌ర‌లించారు. బండి సంజయ్‌ను హన్మకొండ తీసుకెళ్తున్న పోలీసులు మార్గం మధ్యలో వాహనాలు మారుస్తూ సంజయ్‌ను పటిష్ట భద్రత మధ్య తరలించారు. పాల‌కుర్తి సీహెచ్‌సీలో బండి సంజ‌య్‌కు వైద్యులు ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించారు.

అనంత‌రం జ‌ఫ‌ర్‌గ‌డ్ స్టేష‌న్‌లో కొద్దిసేపు ఉంచిన అధికారులు అనంత‌రం హ‌నుమ‌కొండ మెజిస్ట్రేట్ వ‌ద్దకు సాయంత్రం 4:14 నిముషాల‌కు తీసుకొచ్చారు. కోర్టులోనే జ‌డ్జి అనిత బీజేపీ లీగ‌ల్ టీం, పోలీసు ప‌క్షాన లాయ‌ర్ల వాద‌న‌లు విన్న అనంత‌రం బుధ‌వారం రాత్రి 8:20 గంట‌ల స‌మ‌యంలో బండికి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. క‌రీంన‌గ‌ర్ సెంట్రల్ జైలుకు బండిని త‌ర‌లించారు. బండి సంజ‌య్‌పై రిమాండ్ రిపోర్టు జిల్లా జ‌డ్జికి చేరేంత వ‌ర‌కు కూడా ఎక్కడ సెక్షన్ల వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా జాగ్రత్తప‌డ్డారు.

కొన‌సాగిన ఉత్కంఠ‌..!

ఏ కేసు కింద అరెస్ట్ చేసింది.. ఎందుకు అరెస్టు చేశారో చెప్పకుండా పోలీసులు గోప్యత పాటించ‌డంపై బీజేపీ నాయ‌కుల నుంచి విమ‌ర్శలు వ‌చ్చాయి. ఎక్కడిక‌క్కడే ఆందోళ‌న‌లు నిర్వహించారు. బండి సంజ‌య్ అరెస్టు.. త‌ర‌లింపు చేస్తున్న మార్గలో బీజేపీ కార్యక‌ర్తలు ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. ముఖ్యంగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా పెంబ‌ర్తి వ‌ద్ద బీజేపీ కార్యక‌ర్తలు పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. జ‌న‌గామ‌లో కూడా బీజేపీ నాయ‌కులు నిర‌స‌న‌కు దిగారు. అక్కడ పోలీసులు బీజేపీ నేత‌ల‌పై లాఠీచార్జి నిర్వహించారు.

బండి సంజయ్‌ని కోర్టుకు తరలించే సమయంలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ శ్రేణులు నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్‌‌ను తరలిస్తున్న వాహనంపై చెప్పులు, కోడి గుడ్లు విసిరారు. ఈ క్రమంలోనే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ జిల్లాల్లో, కోర్టు వ‌ద్ద పెద్ద సంఖ్యలో నిర‌స‌న‌లు, అరెస్టుల ప‌ర్వం కొన‌సాగింది. మొత్తంగా బండి సంజ‌య్ అరెస్టు.. కోర్టులో రిమాండ్‌, క‌రీంన‌గ‌ర్ జైలుకు త‌ర‌లించేంత వ‌ర‌కు వ‌రంగ‌ల్ ప‌ట్టణంలో హైటెన్షన్ వాతావ‌ర‌ణం కొన‌సాగింది.

బండిపై దాడి జ‌రిగిందా..?

టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసులో హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కీలక తీర్పు వెలువరించిన విష‌యం తెలిసిందే. కేసులో ఏ1గా పేర్కొన్న బండి సంజయ్‌‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ.. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి సంజయ్ వివరించారు. చొక్కా విప్పి తనకు తగిలిన గాయాలను న్యాయవాదులకు బండి సంజయ్ చూపించారు. పోలీసులు దాడి చేసిన‌ట్లుగా బీజేపీ నేతలు చెప్పారు.

Read more:

గోదావరి బ్యారక్‌లో బండి.. కేటాయించిన ఖైదీ నంబర్ ఇదే.

Advertisement

Next Story

Most Viewed