విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు : ప్రభుత్వ విప్

by Kalyani |
విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు : ప్రభుత్వ విప్
X

దిశ, డోర్నకల్ : ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తెలియజేశారు. మంగళవారం మండల పరిధి మన్నెగూడెం,సంకీస, తోడేళ్లగూడెం,వెన్నారం,తహసిల్దార్ బంజర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నాలకు 500 బోనస్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. రైతులకు టార్పాలిన్ పట్టాలు,గోనె సంచులు అందుబాటులో ఉంచాలని, కాటాలు వేసి తరలించాలని అన్నారు. గత ప్రభుత్వం అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాదుడు, స్కాముల కోసమే స్కీములు పెట్టి చరిత్రలో లేని విధంగా రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. “రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదు.ఒక్కో ఇటుకా పేర్చుతూ ముందుకెళ్తున్నాం.వెంటిలేటర్‌ పై ఉన్న రాష్ట్రానికి ఊపిరి పోస్తున్నామన్నారు. నిధుల పొదుపు మంత్రంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లో ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరు గ్యారంటీలు నెరవేరుస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు,డిఏలు పెంచాం. రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ జరిగింది. బిఆర్ఎస్ పాలనలో భూస్వాములకు రైతు బంధు ఇచ్చారు. డబల్ బెడ్ రూమ్ పేరుతో గారడి మాటలు చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి పది ఎకరాల లోపు రైతన్నలకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కూడా పేదలను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. ప్రజా పాలనలో ప్రజల పై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. పది నెలల్లో నియోజకవర్గానికి దాదాపు రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు జరుపుకుంటున్నాం. మరో 100 కోట్ల అభివృద్ధి పనులకు కృషి చేస్తున్నాను. డోర్నకల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.” డోర్నకల్ లో ఐటిఐ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొలుత తోడేళ్లగూడెం గ్రామ పంచాయతీ భవనం,వెన్నారం సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నాయకుడు మనోజ్ జైన్ ను పరామర్శించారు.

ఇటీవల మరణించిన రెడ్డి బోయిన అంజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రతి మహిళ స్వావలంబన సాధించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. “ఇందిరమ్మ ప్రతి మహిళకు ఆదర్శం. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. ఈ ఏడాది మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ. 25 వేల కోట్ల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.” వచ్చే ఐదు సంవత్సరాల్లో మహిళలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం ఇస్తుందన్నారు.

ఆయన వెంట జిల్లా తహసీల్దార్ కృష్ణవేణి, ఐకెపి శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్, పుర చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, ఇంచార్జ్ కాలం రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు జగదీష్, మండల కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి రామయ్య, గంగాధర్, హనుమ, పట్టణ ఉపాధ్యక్షుడు హరికృష్ణ, మాదా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ సీతారామరెడ్డి, సీఈవో సతీష్, రెడ్డబోయిన శంకర్, శెట్టి వెంకన్న, రంజాన్, సాధనాల వెంకటేశ్వర్లు, ఫరీద్,మున్నా, తోడేళ్ళగూడెం నాయకులు చెన్నబోయిన కృష్ణ, వెంకట్, ఐకెపి వీరలక్ష్మి, ఇన్చార్జి హరీష్, పవన్, ఆంగోత్ సురేష్ నాయక్, డ్వాక్రా మహిళలు తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed