అనుమ‌తులు గోరంత‌..త‌వ్వకాలు చెరువంతా..!

by samatah |
అనుమ‌తులు గోరంత‌..త‌వ్వకాలు చెరువంతా..!
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్ : హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం లింగమడుగుపల్లిలోని రామప్ప చెరువు నుంచి అనుమ‌తికి మించి బంక‌మ‌ట్టి త‌వ్వకాలు జ‌రిపినా అధికారులు చ‌ర్యలు తీసుకోవ‌డం లేదు. ‘దిశ‌’లో క‌థ‌నం ప్రచురితం కావ‌డంతో మ‌ట్టి తోల‌కాల‌ను ఆపేసినా.. ల‌క్షలాది రూపాయ‌ల విలువ చేసే మ‌ట్టిని మాయం చేసిన వారిపై ఎలాంటి చ‌ర్యలు తీసుకోకుండా ఇరిగేష‌న్‌, మైనింగ్ అధికారులు చేష్టలుడిగి చూస్తుండ‌టం అనుమానాల‌కు తావిస్తోంది. కేవ‌లం 1000 క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టి త‌ర‌లింపున‌కు అనుమ‌తులు పొందిన నిర్వాహకులు సుమారు 10వేల క్యూబిక్ మీట‌ర్లకు మించి త‌వ్వకాలు జ‌రిపిన‌ట్లుగా స్పష్టమవుతోంది. ఏడు రోజులుగా సాగిన దందాకు కేవ‌లం రెండు రోజుల‌కే ప‌ర్మిష‌న్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిబంధ‌న‌ల‌ను మాత్రం చెరువులో తొక్కేసి త‌మ దందాను ద‌ర్జాగా సాగించ‌డం, అందుకు రెండు శాఖ‌ల అధికారులు స‌హ‌క‌రించ‌డం జ‌రిగిపోయింది.

దిశ క‌థ‌నంతో ఆగిన మ‌ట్టి దోపిడీ..!

లింగమడుగుపల్లిలోని రామప్ప చెరువులో అక్రమంగా జ‌రుగుతున్న మ‌ట్టి త‌వ్వకాలపై దిశ‌లో మంగ‌ళ‌వారం క‌థ‌నం ప్రచురితం కావ‌డంతో అధికారులు ఆపించారు. ఏడు రోజులుగా సాగుతున్న మ‌ట్టి దందా అక్రమ ర‌వాణాపై దిశ‌లో స‌వివ‌ర‌మైన క‌థ‌నం రావ‌డంతో ప‌ర‌కాల డివిజ‌న్ ఇరిగేష‌న్ ఈఈ సునీత స్పందించారు. ఆమె ఆదేశాల‌తో మ‌ట్టి త‌వ్వకాలకు పాల్పపడుతున్న వారిని ఇరిగేష‌న్ అధికారులు క‌ట్టడి చేశారు. ఆత్మకూర్​ పోలీస్ స్టేష‌న్ అధికారులు కూడా స్పందించి మ‌ట్టి త‌వ్వకాలను ఆపాల్సిందిగా, ర‌వాణాను వెంట‌నే నిల‌పాల్సిందిగా స‌ద‌రు నిర్వాహకులకు ఆదేశాలు వెళ్లిన‌ట్లు స‌మాచారం. దీంతో మొత్తానికి మ‌ట్టి మాఫియా చెర నుంచి త‌ప్పించిన‌ట్లయింది.

చెర‌బ‌ట్టినా వ‌దిలేశారు..!

కేవ‌లం వెయ్యి క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టి త‌వ్వకాలకు అనుమ‌తులు పొందిన‌ట్లు ఇరిగేష‌న్ ఈఈ సునీత వెల్లడించారు. ఒక టిప్పరులో 27 క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని త‌ర‌లించేందుకు అనుమ‌తులుంటాయి. ఆ లెక్కన 37 టిప్పర్లకు మించి త‌వ్వకాలు జ‌ర‌ప‌కూడ‌దు. కానీ ఏడు రోజుల పాటు వంద‌లాది టిప్పర్ల చెరువు మ‌ట్టిని రేయింబ‌వ‌ళ్లు త‌వ్వకాలు జ‌రిపిన‌ట్లుగా చెబుతున్నారు. త‌వ్వకాలు జ‌రిగిన చెరువు ప్రదేశాలను చూసినా అనుమ‌తుల మాటున వంద‌లాది టిప్పర్ల చెరువు మ‌ట్టిని మాయం చేశార‌నే విష‌యం స్పష్టమవుతోంది.. ఎక్స్‌క‌వేట‌ర్ల సాయంతో త‌వ్వకాలు జ‌ర‌ప‌డంతో భారీగా గుంత‌లు ఏర్పడి చెరువు స‌మ‌తుల్యాన్ని దెబ్బతీసేవిధంగా, ప్రమాదాలకు నెల‌వుగా చెరువును మార్చేశారు.

ఒప్పందం ప్రకారమే అక్రమాల జాత‌ర‌...!

అనుమ‌తుల మాటున అక్రమంగా త‌వ్వకాలు జ‌రిపిన వారిపై ఎలాంటి చ‌ర్యలు తీసుకోకుండా ఇరిగేష‌న్‌, మైనింగ్ అధికారులు మౌనం దాల్చడం విశేషం. అధికార పార్టీకి చెందిన నేత‌ల భాగ‌స్వామ్యం ఈ దందాలో ఉన్నట్లు స‌మాచారం. అంతేకాదు ఇరిగేష‌న్‌, మైనింగ్ అధికారుల‌కు సైతం అక్రమంగా మ‌ట్టి త‌వ్వకాలు, త‌ర‌లింపు వ్యవహారం ముంద‌స్తు ఒప్పందం ప్రకారమే జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. దిశ‌లో క‌థ‌నం రావ‌డంతో అధికారులు చ‌ర్యలు తీసుకున్నట్లుగా న‌టిస్తే.. తాము ఆపేసిన‌ట్లుగా స‌ద‌రు మ‌ట్టి త‌వ్వకం దారులు అనున‌యిస్తున్నారు. అనుమ‌తికి మించి త‌వ్వకాలు జ‌రిగిన‌ట్లుగా అంగీక‌రిస్తున్న అధికారులు.. త‌వ్వకాలు జ‌రిపిన వారిపై ఎలాంటి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం అధికారుల‌కు మాముళ్లు అందాయ‌న్న ఆరోప‌ణ‌లు, అనుమానాలకు బ‌లం చేకూరుస్తున్నాయి.

1000 క్యూబిక్ మీటర్ల వరకే పర్మిషన్

సునీత‌, ప‌ర‌కాల డివిజ‌న్ ఇరిగేష‌న్ ఈఈ

అనుమ‌తికి మించి త‌వ్వకాలు జ‌రుగుతున్నాయ‌ని మా దృష్టికి వ‌చ్చిన వెంట‌నే త‌వ్వకాలు ఆపాల్సిందిగా ఆదేశించాం. దిశ‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని కూడా ప‌రిశీలించాం. 1000 క్యూబిక్ మీట‌ర్ల వ‌ర‌కు అనుమ‌తులిచ్చాం. అనుమ‌తికి మించి త‌వ్వకాలు జ‌రిగాయా..? లేదా అన్న విష‌యాన్ని చెరువును ప‌రిశీలించాక అంచనా వేస్తాం. అవ‌స‌ర‌మైతే సిబ్బందిచే త‌నిఖీలు తప్పకుండా చేప‌డుతాం.

Advertisement

Next Story