ఇంత నియంతృత్వమా..?

by S Gopi |
ఇంత నియంతృత్వమా..?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: సీఎం వ‌రంగ‌ల్, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ప‌ర్యట‌న నేప‌థ్యంలో పోలీసులు ముంద‌స్తుగా అరెస్టులు చేయ‌డంపై విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. గురువారం ఉద‌యం నుంచి న‌ర్సంపేట‌, ప‌ర‌కాల, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద సంఖ్యలో ముంద‌స్తు అరెస్టులు కావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కురిసిన వ‌డ‌గ‌ళ్ల వాన కార‌ణంగా న‌ష్టపోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు, న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు గురువారం వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌ర్యటించ‌నున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాక నేప‌థ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌తోపాటు ప్రజా, రైతు సంఘాల నేత‌లను ముంద‌స్తుగా అరెస్టు చేసి స్టేష‌న్‌లో నిర్బంధించారు. గురువారం తెల్లవారు జాము నుంచే మొద‌లైన అరెస్టుల ప‌ర్వంపై రెండు పార్టీల నేత‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. కొత్త సంవత్సరం రోజున కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సంతోషంగా ఉండాల‌నుకున్న వారి వ్యక్తిగ‌త జీవితానికి ఆటంకం క‌లిగిస్తూ పోలీసులు ఆందోళ‌న‌లు నిర్వహించే అవ‌కాశ‌ముందనే పేరుతో అరెస్టులు చేయ‌డంపై మండిప‌డ్డారు. గ‌తంలో ఇంత నిర్బంధ పాల‌న‌, నిరంకుశ ప్రభుత్వాన్ని చూడ‌లేద‌ని రైతు, ప్రజా సంఘాల నేత‌లు సైతం మండిపడుతున్నారు. రైతాంగ స‌మ‌స్యల‌పై ప్రశ్నించే అవ‌కాశం ముంటే, శాంతియుతంగా నిర‌స‌న‌, ఆందోళ‌న‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంటే అరెస్టులు చేస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story