Minister Seethakka : గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం.

by Aamani |
Minister Seethakka : గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం.
X

దిశ,ములుగు ప్రతినిధి: దట్టమైన అడవి ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గిరిజన పిల్లలను విద్యావంతులుగా చేయడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం బంగారు పల్లి లో రూ.13 లక్షల 50 లతో ఏర్పాటు చేసిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం టీచర్స్ శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అటవీ ప్రాంతాల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీ శాఖ నిబంధనలు ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయలేకపోతున్నామని, దీంతో ఎలాగైనా గిరిజన బిడ్డలకు విద్యను అందించాలని ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరో రెండు మూడు చోట్ల ఇలాంటి పాఠశాలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత పది సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని, వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల మేరకు అన్ని సంక్షేమ పనులను అమలు చేస్తున్నామని, ఇచ్చిన హామీలను కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed