అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి..

by Kalyani |
అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి..
X

దిశ, జ‌న‌గామ‌: రైతాంగాన్ని అత‌లాకుత‌లం చేసిన వ‌డ‌గండ్లు, ఈదురు గాలులతో కురిసిన అకాలవ‌ర్షాల‌పై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు వెంట‌నే స్పందించారు. శనివారం సాయంత్రమే సంబంధిత జిల్లాల క‌లెక్టర్లతో, అధికారుల‌తో ఫోన్ లో మాట్లాడి అప్రమ‌త్తం చేసిన మంత్రి, ఆదివారం మ‌రోసారి న‌ష్టపోయిన పంట‌ల‌ను స్వయంగా ప‌రిశీలించారు. జ‌న‌గామ జిల్లా క‌లెక్టర్ కార్యాల‌యంలో జ‌న‌గామ క‌లెక్టర్ శివ లింగ‌య్య‌, అడిష‌న‌ల్ క‌లెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి స‌మీక్ష చేశారు.

జ‌రిగిన పంట న‌ష్టాల అంచ‌నాల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం మంత్రి జ‌న‌గామ‌కు స‌మీపంలో ఉన్న పెద్ద ప‌హాడ్ గ్రామంలో పంట న‌ష్టాలను అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రిత‌మే ప్రకృతి బీభ‌త్సానికి రైతాంగం బ‌లైంది. స్వయంగా సీఎం కేసీఆర్ ఆయా చోట్ల ప‌ర్యటించి, రైతుల పంట న‌ష్టాల‌ను ప‌రిశీలించారు. రైతుల‌కు భ‌రోసా క‌ల్పించారు. ప‌రిహారం గ‌తంలో ఎక్కడా ఎన్నడూ ఇవ్వనంత‌గా ఎక‌రాకు రూ.10వేలు ఇస్తామ‌ని ప్రక‌టించారు. ఈ న‌ష్టాలు రైతులు మ‌ర‌చిపోక‌ముందే, మ‌రోసారి వ‌డ‌గండ్లు, అకాల వ‌ర్షాలు కుర‌వ‌డం దుర‌దృష్టం అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనే అంద‌రికంటే ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మ‌న జన‌గామ జిల్లాలోనే ప్రారంభించుకున్నామని చెప్పారు.

దీంతో కొంత న‌ష్టాలు త‌గ్గాయని, ఇంకా పంట చేతికి వ‌చ్చే ముందే కురిసిన వ‌ర్షాల‌కు రైతుల విల‌విల‌లాడుతున్నారని అన్నారు. వారిని పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. అధికారులు వెంట‌నే రంగంలోకి దిగాల‌ని, స్వయంగా క్షేత్రాల‌కు వెళ్ళి, రైతుల‌తో మాట్లాడి, పంట న‌ష్టాల‌ను అంచ‌నా వేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మీక్ష‌, పంట న‌ష్టాల ప‌రిశీల‌న‌లో మంత్రి ఎర్రబెల్లితోపాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య, వ్యవ‌సాయ శాఖ అధికారులు, ఇత‌ర ప్రజాప్రతినిధులు, రైతులు త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed