మహాలక్ష్మి, చేయూత పథకాలను జిల్లాలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్..

by Sumithra |
మహాలక్ష్మి, చేయూత పథకాలను జిల్లాలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్..
X

దిశ, ములుగు ప్రతినిధి : శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ డి.వేణు గోపాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రజల కోసం ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. చేయూత పథకం క్రింద రాజీవ్ ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద 1600 రకాల రోగాలకు 1300 ఎంపానల్మెంట్ ఉన్న ఆస్పత్రులలో చికిత్స అందించారని, ఈ రోజు నుండి 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స ప్రజలకు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు.

మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు, ట్రాన్స్ జెండర్ లు ఆర్టీసీలోని పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని, మహిళలు వారి దగ్గర ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డు బస్సులో చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తేవడం పట్ల మహిళలు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. మహాలక్ష్మీ పథకం క్రింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మహిళలతో కలిసి ములుగు ఏరియా ఆస్పత్రి నుండి గట్టమ్మ దేవాలయం వరకు కలెక్టర్ బస్సులో ప్రయాణించారు. బస్సులోని మహిళలకు ఎలాంటి చార్జీలు లేకుండా జీరో ఫేర్ తో కూడిన మహాలక్ష్మి టికెట్ లను కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, డిపో మేనేజర్ సురేష్, డీ డబ్లు ఓ ప్రేమలత, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed