భూ ఆక్రమణదారులపై ఇకపై డేగ కన్ను: ఎస్పీ

by S Gopi |
భూ ఆక్రమణదారులపై ఇకపై డేగ కన్ను: ఎస్పీ
X

దిశ, ములుగు ప్రతినిధి: పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారించాలని, ములుగు ఎస్పీ అధికారులకు పిలుపునిచ్చారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా ఎస్పీ మంగళవారం ములుగు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయములో నిర్వహించారు. ఓఎస్డీ(ములుగు భూపాలపల్లి) అశోక్ కుమార్ ఐపీఎస్, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో ములుగు సబ్ డివిజన్ పరిధిలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతోపాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు.. వాటి స్థితి గతులపై ఎస్పీ.. కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగితెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో భూ ఆక్రమణకు ఎవరైనా పాల్పడితే వారిని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా అదేశించారు. భూ దందాకు పాల్పడితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండబోదని, భూ ఆక్రమణ దారులపై ఇకపై డేగ కన్ను ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు మరణాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ములుగు జిల్లా పరిధిలో ఉన్న హైవేలపై ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకై తగు ముందస్తు చర్యలు తీసుకోవడంతోపాటు, అధికారులు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి రోడ్డు ప్రమాదాల కట్టడికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మరల పునరావృత్తం కాకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి సంబంధిత నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, 60 రోజుల్లోపల ప్రతి కేసును పరిష్కరించే దిశగా శ్రమించాలని అధికారులకు అదేశించారు.

అలాగే పెండింగ్ లో ఉన్న మిస్సింగ్ కేసులకు పరిష్కరించేందుకుగాను అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సి వుంటుందని, మిస్సింగ్ కేసుల్లోని వ్యక్తుల అచూకీ కనుగొని వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, ముఖ్యంగా కేసులు దర్యాప్తు చేసే సమయంలో అధికారులు ఎస్ఓపీని అనుసరించాలని.. నేరస్థుల నేరాలను కోర్టులో నిరూపించే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబర్చాలని, నేరాలను కట్టడి చేయడంతోపాటు నేరస్థులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో ఓఎస్డీ అశోక్ కుమార్ ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, సీఐ(ములుగు) మేకల రంజిత్ కుమార్, సీఐ(పస్రా) శంకర్, సబ్ ఇన్స్పెక్టర్ ములుగు ఓంకార్ యాదవ్, ఎస్ఐ(తడ్వాయి) వెంకటేశ్వర్లు, ఎస్ఐ(వెంకటాపూర్) తాజుద్దీన్, ఎస్ఐ (పస్రా) కర్ణాకర్ రావు, డి. సి. ఆర్. బి ఎస్ఐ కమలాకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed