కాళోజీ క‌ళా క్షేత్రాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి

by Aamani |   ( Updated:2024-01-20 14:21:25.0  )
కాళోజీ క‌ళా క్షేత్రాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కాళోజీ కళా క్షేత్రం పదేళ్ళయినా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఎద్దేవా చేశారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజి కళాక్షేత్రాన్ని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం పరిశీలించారు. కళా క్షేత్రంలో నిర్మిస్తున్న ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం ను మంత్రులు పరిశీలించారు. నిర్మాణ పనులను గురించి కుడా, ఇతర అధికారులు మంత్రులకు వివరించారు. కాలేజీ కళాక్షత్రానికి సంబంధించిన మ్యాపును మంత్రులు పరిశీలించారు.

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రుల వెంట ప్రభుత్వ విప్ రామ్ చంద్రనాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, కుడా అధికారులు అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం హనుమకొండ జిల్లా పరిధిలోని రాంపూర్ శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సర్కిల్ వద్ద హైదరాబాద్ భూపాలపట్నం జాతీయ రహదారి లో వరంగల్ కు వచ్చే రోడ్డు మార్గం రూట్ సరిగా లేదనే ప్రజల అభిప్రాయం మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు.

వరంగల్ రోడ్డు మార్గం తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారనే ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండడంతో మంత్రులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని జాతీయ రహదారి ప్రాంతాన్ని పరిశీలించారు. వాటికి సంబంధించిన మ్యాపును పరిశీలించారు. వరంగల్ కు వచ్చే రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో లోపాలను సవరించేందుకు సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు, కుడా అధికారులను ఆదేశించారు. సరైన విధంగా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాన్ని అధికారులు చూడాలని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగేంద్ర రావు , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వరంగల్ విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, కుడా పిఓ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story