ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం సూచించిన ప్రకారమే సిబ్బంది సర్వే నిర్వహించాలి : మహబూబాబాద్ కలెక్టర్

by Aamani |
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం సూచించిన ప్రకారమే సిబ్బంది సర్వే నిర్వహించాలి : మహబూబాబాద్ కలెక్టర్
X

దిశ,గూడూరు: ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం సూచించిన ప్రకారమే సిబ్బంది సర్వే నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. పక్కా సమాచారం సేకరించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా వేగంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతుందని అర్హులైన లబ్ధిదారుల వివరాలు సేకరించి ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వాములను చేస్తూ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే చేయాలని అన్నారు. గూడూరు మండలం లోని బొద్దుగొండ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

మండలంలోని దామరవంచ, అయోధ్య పురం గ్రామాల్లో గిరిజన సహకార సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లర్లకు తరలించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం వివరాల రిజిస్టర్ లను పరిశీలించారు.ధాన్యానికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి రైతులకు డబ్బులు త్వరగా పడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

గూడూరు మండల కేంద్రం లోని ఆశ్రమ పాఠశాల ను సందర్శించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైట్ మెనూ షెడ్యూల్ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని, వసతి గృహాలలో పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని స్టడీ రూమ్, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు, విద్యార్థినీ ,విద్యార్థుల మానసిక, విద్య ,వైద్యం స్థితిగతులను గమనిస్తూ ఉండాలని, వంద శాతం ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం విద్యా బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గూడూరు తహశీల్దార్ శ్వేత , ఎంపిడివో వీరస్వామి , గూడూరు మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story