త్రిన‌గ‌రిపై త్రినేత్రం.. ప్రధాన‌మంత్రి హ‌న్మకొండ ప‌ర్యట‌న నేప‌థ్యంలో భారీ భ‌ద్రత‌

by samatah |   ( Updated:2023-07-07 03:29:46.0  )
త్రిన‌గ‌రిపై త్రినేత్రం.. ప్రధాన‌మంత్రి హ‌న్మకొండ ప‌ర్యట‌న నేప‌థ్యంలో భారీ భ‌ద్రత‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఓరుగ‌ల్లు ట్రైసిటీపై నిఘా నేత్రం కొన‌సాగుతోంది. ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 8న‌ హ‌న్మకొండ జిల్లాలో ప‌ర్యటించనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే న‌గ‌రంలో భారీ బందోబ‌స్తును న‌గ‌ర పోలీసులు అమ‌ల్లోకి తీసుకువ‌చ్చారు. హ‌న్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌లో జ‌రగ‌బోయే బీజేపీ బ‌హిరంగ స‌భ‌లో ప్రధాన‌మంత్రి పాల్గొన‌నున్నారు. ప్రధాన‌మంత్రి భ‌ద్రత‌రీత్య కేంద్ర బ‌లగాలు, గ్రేహౌండ్స్‌, ఆక్టోప‌స్ ద‌ళాల భ‌ద్రతా ప‌ర్యవేక్షణ‌లోనే స‌భా ఏర్పాట్లన్నీ కూడా జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. స‌భా స్థలాన్ని కేంద్ర భ‌ద్రతా బ‌ల‌గాలు త‌మ ఆధీనంలోకి తీసుకున్నాయి.

గ్రౌహౌండ్స్‌, ఆక్టోప‌స్ అడిష‌న‌ల్ డీజీపీ స‌మీక్ష..

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీపీ విజయ్ ఆధ్వర్యంలో డీఐజీ, ఎస్పీలు, ఏఎస్సీ స్థాయి అధికారులతో గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన భద్రత ఏర్పాట్ల వివ‌రాల‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అడిషినల్ డీజీపీకి వివరించారు. ముఖ్యంగా ప్రధాని భద్రత కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందుస్తు చర్యలతో పాటు హెలీప్యాడ్, రోడ్డు బందోబస్తు, భద్రకాళి దేవాలయం, బహిరంగ సభల వద్ద ఏర్పాటు చేయాల్సిన భద్రత ఏర్పాట్లతో పాటు నిర్వహించాల్చిన విధులపై అధికారులకు అడిషినల్ డీజీపీ పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఐజీలు సత్యనారాయణ రెడ్డి, రమేష్ నాయుడుతో పాటు కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.

నో ప్లై జోన్‌గా వరంగల్, హన్మకొండ..

హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రాల్లో ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లోని గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా గురువారం నుంచి 8వ తేదీ సాయంత్రం వ‌ర‌కు వరంగల్, హన్మకొండ నగరానికి 20కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్ గా ప్రకటించడం జరిగింద‌న్నారు. డ్రోన్, రిమోట్ కంట్రోల్​తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేధించడం జ‌రిగింద‌ని తెలిపారు. ఎవరైన వ్యక్తులుగాని, సంస్థలుగాని ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

ట్రై సిటీ పరిధిలో 144 సెక్షన్..

ప్రధాని పర్యటన సందర్భంగా ట్రై సిటీ పరిధిలో 144 సెక్షన్ అమల్లోకి రానుంద‌ని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అనుసరించి గుమికూడటం, ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించడం, మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేయడంపై నిషేధించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ ఆజ్ఞలు ఈనెల 7 వ తేదీ ఉద‌యం 6 గంట‌ల నుంచి 8తేదీ సాయంత్రం 6గంటలకు అమలులో ఉండ‌నున్నాయి.

Advertisement

Next Story