ములుగు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ: కేటీఆర్

by Dishaweb |   ( Updated:2023-06-07 13:47:40.0  )
ములుగు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ: కేటీఆర్
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించారు.జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి మహమూద్‌ అలీతో కలిసి హెలికాప్టర్‌లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ స్వాగతం పలికారు. అనంతరం డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయానికి, దాని పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్‌ బస్టాండ్‌ సముదాయానికి, సేవాలాల్‌ భవనానికి సైతం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని ములుగు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.30లక్షలతో నిర్మించే డిజిటల్‌ లైబ్రరీ, రూ.15 లక్షలతో నిర్మించే సమాచార పౌరసంబంధాల శాఖ మీటింగ్‌ హాల్‌ పనులకు శంకుస్థాపనలు, జిల్లా కేంద్రంలో రూ.2కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.అక్కడి నుంచి సాధన స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు నిండిన సందర్భంలో దశాబ్ది సంబురాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒకనాడు మహాకవి దాశరథి ఆ నాడు స్వాత్రంత్యోద్రమ సమయంలో జైలులో పెట్టిన సందర్భంలో బొగ్గుతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడలపై రాశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే స్వరాష్ట్రం ఏర్పడాలని 14 సంవత్సరాల పాటు పోరాటం చేశారు అని, ప్రొఫెసర్‌ జయశంకర్‌లాంటి మేథావుల సహకారం, సారథ్యంలో తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఎత్తినజెండా దించకుండా పోరాటం చేసి.. ఆనాడు దాశరథి అన్న నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు.. కోటిన్నర ఎకరాల మాగాణ అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అన్నారు.

ముఖ్యమంత్రి సారథ్యంలో ఇవాళ సాగునీటి దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్నాం ఇక్కడికి హెలికాప్టర్‌లో వచ్చిన సమయంలో అంతా చూసుకుంటు వచ్చాం ఎంతటి అద్భుతమైన దృశ్యం మన కండ్ల ముందటే కనిపిస్తున్నది అని,ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండల్లా నిండుగా కనిపిస్తున్నయ్‌ అని, మాడుపలిగేలా ఉన్న ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతయని కలలో కూడా అనుకున్నమా ఆలోచించాలి అని అన్నారు. ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఊళ్లకు వెళ్లాలంటే భయపడేవారు ఊరికి వెళ్తే బిందెలు అడ్డం పెడతారో.. ఎక్కడ బోరింగ్‌ అడుగుతరో.. మోటరు అడుగుతరో.. అటు పైసలు లేక.. ప్రభుత్వం పట్టించుకోక అదోగతిపాలై ఆ నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో, సమైక్య రాష్ట్ర పాలనలో ఎంతో గోస ఉండేదే అందరూ గుర్తు చేసుకోవాలి. ఆ బాధ, ఆ గోస నేడు ఉన్నదా? ఒకసారి గుండెలమీద చేయివేసుకొని చెప్పాలి అన్నారు. 67 సంవత్సరాల పాటు తెలంగాణ రాక ముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్‌కు కాదా? దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? మా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తాగునీరు ఇవ్వక సావగొట్టింది కాంగ్రెస్‌ కాదా? సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్‌ కాదా? ఇవాళ మళ్లీ వాళ్లే ముందటపడి అడ్డంపొడువు మాట్లాడితే నమ్ముదామా? లేదంటే మన గొంతు తడిపిన కేసీఆర్‌తో గళం కలిపి, భుజం తట్టి కేసీఆర్‌ మీరుకు ముందుకు నడవండి.. మీరు బాగుంటేనే పేదవారు బాగుంటారు.. రైతులు బాగుంటరు, వ్యవసాయం బాగుంటది అని చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహిద్దామా? ఆలోచించాలి అని, సంక్రాంతి గంగిరెద్దులోళ్లు బయలుదేరి వచ్చినట్లు ఎలక్షన్లు రాంగనే బయలుదేరి వచ్చినట్లు కాంగ్రెస్‌, బీజేపోళ్లు వస్తున్నరు అని, నోటికి వచ్చినట్లు అడ్డంపొడువు మాట్లాడుతరు. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. పక్కకే ఉన్నది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం అక్కడ ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం నేను సూటిగా తెలంగాణ రైతులను అడుగుతున్నా ఆలోచించాలి అని కోరారు.



గతంలో 60 సంవత్సరాల ప్రజల చిరకాల ఆకాంక్ష 3146 గిరిజన తండాలు గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజకీయాలకతీతంగా ములుగును ప్రత్యేక జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి 133 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల చేపడుతున్నామని, ములుగు జిల్లాలో దళితులకు 2 కోట్ల 39 లక్షల సబ్సిడీ, గిరిజనులకు కోటి 48 లక్షలు సబ్సిడీ, మూడు వేల యాదవులకు గొర్రెల పంపిణీ యూనిట్లు, 33 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, 1181 మహిళా సంఘాలకు 110 కోట్ల చెక్కు, సబ్సిడీపై మూడు ట్రాక్టర్లు 44 లక్షల విలువగల పనిముట్లను, 37 మందిర్ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ములుగు నియోజకవర్గ పరిధిలో 17వేల ఎకరాల పోడు పట్టాలను పంపిణీకి సిద్ధం చేశామని, ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ కారణంగా జాతీయ పంచాయతీ అవార్డులలో దేశస్థాయిలో రెండవ స్థానంలో నిలిచామని, 67 కొత్త గ్రామపంచాయతీలు రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నామని, గతంలో ఏజెన్సీ ప్రాంతాలలో మంచం పట్టిన మన్యం అనే వార్తలు వచ్చేవని, సర్కారు దవాఖానాల్లో వసతులు వైద్యులు ఉండేవారు కాదని,నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే పాటలు వచ్చాయని , ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో విశ్వాసం పెంచి జిల్లా ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నామని జిల్లాలో వైద్య కళాశాల సైతం మంజూరు చేశామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 34 నుంచి 80 శాతానికి పెరిగిందని, ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్నవిశ్వసనీయతకు నిదర్శనమని, నీళ్ల ద్వారా సంక్రమించే వ్యాధులు గణనీయంగా తగ్గిపోయాయని, ములుగు నియోజకవర్గ పరిధిలో 74,774 మంది రైతులకు 644 కోట్ల రైతుబంధు , 986 రైతు కుటుంబాలకు 48 కోట్ల 30 లక్షల రైతు బీమా సొమ్ము 40,000 మందికి ఆసరా పింఛన్లు ,3141 కెసిఆర్ కిట్లు అందించామని, కంటి వెలుగు కార్యక్రమం కింద 1 లక్ష 66 వేల మందికి పరీక్షలు నిర్వహించి 40000 అద్దాలు పంపిణీ చేశామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ప్రజలకు వైద్య పరీక్షల నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పైలట్ ప్రాజెక్టులో రాజన్న సిరిసిల్ల జిల్లా తో పాటు రాజకీయాలకతీతంగా వెనుకబడిన ములుగు జిల్లాల సైతం ఎంపిక చేసి లక్ష అరవై రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించామని అన్నారు.

ప్రజలలో మల్లంపల్లి మండల కేంద్రం ఏర్పాటుకు ఉన్న డిమాండ్ కు సానుకూలంగా స్పందించి త్వరలో ఏర్పాటు చేయుటకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అవసరాలను తీరుస్తూ విపక్షం, స్వపక్షం అనే తేడా లేకుండా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని శిల్ప సంపదను తిలకించి రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప చెరువు కట్ట వద్దకు చేరుకొని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభించి, అకడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ కవిత, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, రాష్ట్ర చైర్మన్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story