‘గతంలో సిద్దిపేట నేడు ఇల్లందు మున్సిపాలిటీ’

by samatah |
‘గతంలో సిద్దిపేట నేడు ఇల్లందు మున్సిపాలిటీ’
X

దిశ,ఇల్లందు: ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రజలకు భారం కాకుండా ఆదాయ వనరుల సమకూర్చుకోవాలని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. సోమవారం ఇల్లందుమున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రూ.40.68 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఈసందర్భంగా ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో సుమారుగా 9వేల ఇండ్లు ఉండగా పంపు కనెక్షన్లు కూడా 9 వేల ఉండాలని సూచించారు.ముందుగా పంపు కనెక్షన్ల లెక్క తేల్చాలన్నారు.అన్ని రకాల పన్నులను సంక్రమంగా వసూలు చేస్తేనే కార్మికులకు జీతాలు ఇవ్వడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో ఇల్లందు మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడం జరుగుతుందని తెలిపారు.సుమారుగా 20 ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రధాన రోడ్డును బిటి రోడ్డు వేయడం ద్వారా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు కాలయాపన చేయకుండా పరిష్కరించాలని సూచించారు. సింగరేణి సంస్థ అందజేసే డియంఎఫ్ టి నిధులను మరింతగా పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇల్లందు మున్సిపల్ అభివృద్ధి లో అందరి సహకారం,కృషి ఉందన్నారు.1100 క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

గతంలో ఇతర మున్సిపాలిటీలకు అభివృద్ధి చూపెట్టాలంటే సిద్దిపేట చూపించేవారని ఇప్పుడు జాతీయస్థాయిలో 18వ స్థానంలో ఉన్న ఇల్లందు మున్సిపాలిటీ వైపే అన్ని మున్సిపాలిటీలు చూస్తున్నాయన్నారు.ప్రగతిలో ఇల్లందు మున్సిపాలిటీ దూసుకుపోతుందని తెలిపారు.రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి లేని విధంగా ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం ఉందని,అసెంబ్లీని తలపించే విధంగా ఉందన్నారు.గతంలో ఇల్లందులో ఉన్న ఇండ్లు అమ్ముకొనే పరిస్థితి నుంచి ప్రస్తుతం భారీగా ఇండ్ల నిర్మాణాలు జరగడం సంతోషకరమన్నారు. మున్సిపల్ వనరులను పెంచేందుకు మున్సిపల్ కౌన్సిలర్ల నుంచి సబ్ కమిటీ వేసుకొని ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం 2023-24 బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు,కమిషనర్ అంకుషావలి,డీఈ రచ్చ రామకృష్ణ,ఏఈ శంకర్,జెఏఓ శ్రీనివాస్ రెడ్డి, టిపిఎస్ సతీష్, ఆర్ఐ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story