న‌కిలీ బిల్లుల‌తో నిధులు స్వాహా.. సీఐడీ తీగ‌లాగితే క‌దిలిన అక్రమాల‌ డొంక‌

by Anjali |
న‌కిలీ బిల్లుల‌తో నిధులు స్వాహా.. సీఐడీ తీగ‌లాగితే క‌దిలిన అక్రమాల‌ డొంక‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్​లో అక్రమాలు జరిగినట్లు సీఐడీ తాజాగా గుర్తించింది. రోగులకు వైద్యం అందించకుండా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాకు సంబంధించి మొత్తం మూడు ఆస్పత్రుల్లో బిల్లుల గోల్‌మాల్ వ్యవ‌హారం బ‌ట్టబ‌య‌లైంది. హ‌న్మకొండ‌లోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి రోహిణి పేరు ఉండ‌టం గ‌మ‌నార్హం.

అలాగే మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీసంజ‌వ‌నీ, సిదార్థ ఆస్పత్రులు కూడా అక్రమాల‌కు పాల్పడిన‌ట్లుగా సీఐడీ త‌నిఖీల్లో గుర్తించారు. మూడు ప్రైవేట్ ఆస్పత్రులపై సీఐడీ ఆరు కేసులు నమోదు చేసింది. బీఆర్ఎస్ హయాంలో గతేడాది ఏప్రిల్‌కు ముందు కూడా మెడిక‌ల్ స్కాం జ‌రిగిన‌ట్లుగా సీఐడీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. వైద్యం చేయ‌కుండానే న‌కిలీ బిల్లులు స‌మ‌ర్పించి సీఎంఆర్ ఎఫ్ నిధుల‌ను కాజేసిన ఆస్పత్రుల‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియ‌స్‌గా వ్యవ‌హ‌రిస్తోంది. ఈ మేర‌కు తీగ‌లాగితే డొంక క‌దిలిన చందంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ అధికారులు చేసిన దాడుల‌తో న‌కిలీ బిల్లుల విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

రోహిణీలో అక్రమాలు..

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల రోహిణి ఆస్పత్రిలోని ఫార్మసీ సెంట‌ర్‌లో గ‌డువు తీరిన మందుల‌ను విక్రయించిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. డ్రగ్ అధికారులు విచార‌ణ చేసి గ‌డువు తీరిన మందుల‌ను అమ్మిన‌ట్లుగా కూడా ధ్రువీక‌రించారు. దీనిపై అధికారుల పూర్తి విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే తాజాగా రోహిణిలో సీఎంఆర్ ఎఫ్ నిధుల కాజేత విష‌యంలో వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అక్రమాలు జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో స‌ద‌రు ఆస్పత్రుల్లోనూ సీఐడీ త‌నిఖీలు చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని వైద్య వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. తాజా ఘ‌ట‌న‌లు అక్రమాల‌కు పాల్పడిన ప్రైవేటు ఆస్పత్రుల యాజ‌మాన్యాల్లో వ‌ణుకు పుట్టిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed